కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 6 : తెలంగాణ ప్రభుత్వ పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లు (డబుల్ బెడ్రూమ్)ల కేటాయింపు పారదర్శకంగా అర్హులైన పేదలకు అందించడం జరుగుతుందని..ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తామని డబ్బులు వసూళ్లు చేస్తున్న మాయగాళ్ల ఉచ్చులో పడొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గూడులేని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు.
దీనిలో కూకట్పల్లి నియోజకవర్గానికి 4400 ఇండ్లను కేటాయించగా.. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల ధ్రువపత్రాలను పరిశీలించే ప్రక్రియ చేపట్టిందన్నారు. దీనికి దరఖాస్తుదారులంతా కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చి అధికారులకు సహకరించాలన్నారు.అర్హులైన పేదలందరికీ దశలవారీగా డబుల్ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని..పారదర్శకంగా లాటరీ పద్ధతితో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు.
మోసగాళ్ల మాటలు నమ్మొద్దు..
ఇటీవల కేపీహెచ్‌బీ కాలనీలో మోసగాళ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో నకిలీ అలాట్మెంట్ లెటర్లు, నకిలీ రసీదులు సృష్టించి లక్షల్లో డబ్బులు వసూళ్లు చేశారని.. చివరకు పోలీసులకు చిక్కి ఊసలు లెక్కిస్తున్నారని తెలిపారు. అమాయకులైన ప్రజల సొంతింటి కలను ఆసరాగా చేసుకుని మధ్యవర్తులు, బ్రోకర్లు డబ్బులు వసూళ్లు చేస్తున్న విషయం తనవద్దకు వచ్చిందన్నారు. ఇండ్ల కేటాయింపులో ఒక్క రూపాయి కూడా ఖర్చులేదని..మోసగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని కోరారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని.. ప్రజా ప్రతినిధులు, బ్రోకర్లు, ఉద్యోగులెవరికీ ఇండ్ల కేటాయింపు ప్రక్రియలో పాత్ర ఉండదని తెలిపారు. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో, మధ్యవర్తుల మాయమాటలతో ఇండ్లు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ఎవరు డబ్బులు అడిగినా వెంటనే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. నా వ్యక్తిగత ఫోన్ నం.9347056789 కు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు. ఇండ్లను అర్హులైన పేదలకు అందించడమే తన లక్ష్యమని తెలిపారు.