సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతమున్న ఇంటి చిరునామాలో అందుబాటులో ఉండాలని బల్దియా అధికారులు సూచించారు. దరఖాస్తులో రిజర్వేషన్ కేటగిరి, అసెంబ్లీ నియోజకవర్గం, ఓటరు గుర్తింపు కార్డు జతపర్చలేదని, ఈ వివరాలు సేకరించేందుకు దరఖాస్తులో పొందుపరిచిన అడ్రస్‌కు సిబ్బంది, అధికారులు వస్తారని, వారికి సంబంధిత సమాచారం ఇవ్వాలని కోరారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇంతకు ముందు డబుల్బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత దరఖాస్తులో రిజర్వేషన్ కేటగిరి, సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు, ఓటరు ఫొటో గుర్తింపు కార్డు లేవని పేర్కొన్నారు. ఈ వివరాలు సేకరించేందుకు గతంలో చేసుకున్న దరఖాస్తులలో పొందుపరిచిన/సూచించిన అడ్రస్‌కు రిజర్వేషన్ కేటగిరి, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు, ఓటరు ఫొటో గుర్తింపు కార్డు సేకరణకు సంబంధిత దరఖాస్తుదారుడి ఇంటి వద్దకు జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు వస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుదారులు ఇంటివద్దనే అందుబాటులో ఉండి వారికి సంబంధిత సమాచారం అందజేయాలని కోరారు.