కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 3: పేద విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటానని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందించే బాధ్యత తనదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీనిచ్చారు. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదివేల మంది విద్యార్థులకు బ్యాగులు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్నిళ్లు, డిక్షనరీతో కూడిన పాఠశాల కిట్టును ఎమ్మెల్యే కృష్ణారావు సొంత నిధులతో పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీ బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 772మంది విద్యార్థులకు ఎమ్మెల్యే కృష్ణారావు పాఠశాల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబురావు, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, ఎంఈవో ఆంజనేయులు సహపంక్తి భోజనం చేశారు.
ఎన్టీఆర్ పాఠశాలకు కోటి విరాళం..
కేపీహెచ్‌బీ కాలనీలో ఎన్టీఆర్ పేరుతో ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తే కోటి రూపాయల విరాళం అందిస్తానని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు ప్రకటించారు. బుధవారం కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రభుత్వ పాఠశాల కోసం కేటాయించిన స్థలంలో పాఠశాలను నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వ పాఠశాలకు స్వర్గీయ నందమూరి తారకరామారావు పాఠశాలగా నామకరణం చేస్తే కోటి రూపాయలు సొంత నిధులను అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ల అధ్యక్షులు ఎం.కృష్ణారెడ్డి, సీహెచ్.ప్రభాకర్ గౌడ్, రాజేశ్‌రాయ్, సాయిశ్రీనివాస్, పాతూరి గోపి, వెంకట్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, చైతన్య, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.