కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 3 : మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని మహిళలు స్వయం సంవృద్ధిని సాధించేలా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోనల్ ఆఫీస్ మీటింగ్హాల్లో స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల రిసోర్స్ పర్సన్స్ (ఆర్పీ)లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో జడ్సీ మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలు బస్తీలలో కొత్తగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని.. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘాలను బలోపేతం చేయాలని అన్నారు. ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తూ పుస్తక నిర్వాహణ, సంస్థాగత నిర్మాణం, పట్టణ సమాఖ్య ఏర్పాటు, శ్రీనిధి బ్యాంకు రుణాలపై మహిళలు అవగాహన పెంచుకోవాలని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలను పొందడం.. సకాలంలో చెల్లించడం వల్ల వచ్చే లాభాలను వివరిస్తూ సంఘాలను బలోపేతం చేయాలన్నారు. అనంతరం శిక్షణ పొందిన ఆర్పీలకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు డైరెక్టర్ సౌజన్య, జంట సర్కిళ్ల ప్రాజెక్టు ఆఫీసర్లు ప్రభాకర్, ఇంద్రసేన, ఏపీ మాస్ పోగ్రామ్ మేనేజర్ శ్రీనివాస్, శ్రీనిధి డీజీఎం రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు మహిపాల్ రెడ్డి, ముస్తఫా, సుజాత, మురళీ, సురేశ్, ప్రసాద్, ఇందిర, ఆర్పీలు పాల్గొన్నారు.