మాదాపూర్, ఆగస్టు 2: భూ వివాదాలతో ఒకరిని హతమార్చిన ఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం, బాలానగర్ డీసీపీ సందీప్ రావు, ఏసీపీ రఘునందన్ రావులతో పాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్‌లతో సిబ్బంది కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ సందీప్ రావు మాట్లాడుతూ, మేడ్చల్ మండలం దుండిగల్ దొమ్మర పోచంపల్లికి చెందిన ఏ1 నిందితుడు మహమ్మద్ ముజాయిద్(50) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కాలా పత్తర్ నవాబ్ సాబ్ కుంటకు చెందిన ఇస్మాయీల్(34), రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఒకరికి తెల్వకుండా ఒకరు ప్లాట్లను విక్రయించడంతో మనస్పర్దలు ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో వీరి మధ్య తరచు గొడవలు జరగడంతో ముజాయిద్ ఎలాగైనా ఇస్మాయీల్తో ఎప్పటికైనా ప్రాణహాని ఉంటుందని ముందుగానే ఆలోచించి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ నెల 31వ తేదీన ఇస్మాయీల్ను చంపేందుకు ప్లాన్ చేసి ప్లాట్‌ను ఇవ్వలేను రూ.20 లక్షలు ఇస్తాను మసాబ్ ట్యాంక్ వద్దకు వచ్చి తీసుకో అని ఫోన్లో చెప్పాడు. అందరు కలుసుకొని రాత్రం తా కార్లలో నగరంలో తిరుగుతూ మాదాపూర్‌లోని నీరూస్ జంక్ష న్ వద్ద ఉన్నటువంటి స్ట్రీట్ ఫుడ్ వద్దకు చేరుకొని టిఫిన్ చేశారు. రాత్రి 11 గంటల నుంచి మద్యం తాగుతూ భూమి గురించి మాట్లాడుకుంటూ ఉండగా తెల్లవారు జాము 4 గంటల సమయంలో ఇస్మాయీల్‌కు ముజాయిద్‌కు మధ్య మాట మాట పెరిగి గట్టిగా అరుచుకున్నారు.
ముజాయిద్ తుపాకిని గురి పెట్టడంతో అది పేలకపోవడం గమనించిన ఇస్మాయీల్ ఇలాంటి బెదిరింపులు చాలా చూశాను.. అని బెదిరించాడు. దీంతో ముజాయిద్ స్నేహితుడు జిలాని ప్రక్కనే ఉన్న ఓ వీధిలోకి వెళ్ళి తుపాకీని లోడ్ చేశాడు. ఇద్దరు గొడవపడుతుండగా వెనకాల నుంచి వచ్చి తుపాకీతో తల వెనకాల భాగంలో కాల్చాడు. దీంతో ఇస్మాయీల్ మెదడు బయటకు వచ్చింది. మధ్యలో వచ్చిన ఇస్మాయీల్ స్నేహితుడు జాహంగీర్పై తుపాకీతో దాడి చేయడంతో గాయాలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న ఇస్మాయీల్ స్నేహితులు అతన్ని దవాఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు.
పోలీసుల అదుపులో నిందితులు
జిలానీ పాషా, మహమ్మద్ ఫిరోజ్‌లు శంకర్‌పల్లిలోని మీర్జాగూడ క్రాస్ రోడ్డు వద్ద తిరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ముజాయిద్ జహీరాబాద్‌లో ఉన్నట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో మహమ్మద్ ముజాయిద్ను జహీరాబాద్‌లో అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి చేవెళ్ళకు వెళ్ళి ఎర్టిగా కారుతో పాటు అందులో ఉన్నటువంటి తుపాకులు 2, లైవ్ క్యాట్రిడ్జ్ 4, ఓ కత్తితో పాటు యమహా ఫ్యాసినోని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సందీప్ రావు తెలిపారు. నిందితులను జువైనల్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.