కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 31 : ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం పది నిమిషాలు కేటాయించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రజలను కోరారు. ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ఎమ్మెల్యే కృష్ణారావు ఆదివారం ఉదయం తన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. ఇంటి పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న డ్రుమ్ములు, వస్తువులు, పూల కుండీలలో నీటి నిల్వలను ఆధారంగా చేసుకుని దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమ కాటుతో డెంగీ, మలేరియా లాంటి విషజ్వారాలు వస్తాయన్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఎంటమాలజీ సిబ్బంది పాల్గొన్నారు.
దోమల నియంత్రణకు సహకరించాలి
సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా లాంటి వ్యాధులకు కారణమయ్యే దోమలను లార్వా దశలోనే నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు అన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాన్ని కార్పొరేటర్ శిరీషాబాబురావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంటమాలజీ అసిస్టెంట్ నాగేశ్ తదితరులున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీలో..
దోమల నియంత్రణలో భాగంగా చేపట్టిన పది నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంటమాలజీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. కేపీహెచ్‌బీ కాలనీ 1, 2, 3, 9 ఫేజ్‌లు, వసంతనగర్ కాలనీలలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు, ప్రముఖుల ఇంటికెళ్లి దోమల వృద్ధిపై అవగాహన కల్పించి రసాయనాలను పిచికారి చేశారు. కరపత్రాలను పంచుతూ ప్రజలందరూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంటమాలజీ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి తదితరులున్నారు.
పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం..
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకర పరిస్థితులు నెలకొంటాయని హైదర్‌నగర్ కార్పొరేటర్ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పది గంటలకు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా హైదర్‌నగర్ డివిజన్లోని తన కార్యాలయంలో దోమల నివారణ మందును స్ప్రే చేశారు. అనంతరం అవగాహన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.
ఆల్విన్ కాలనీ డివిజన్లో ..
ఆల్విన్ కాలనీ డివిజన్లో పది గంటలకు పది నిముషాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ఆదివారం ఎంటమాలజీ సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. గుడ్ విల్ హోటల్ చౌరస్తా నుంచి పాదయాత్రగా దుకాణాలు, ఆవాసాల ఎదుట డ్రమ్ములు, టైర్లు, కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అనీల్‌రెడ్డి, శ్రీనివాస్, భాస్కర్‌రెడ్డి, శివరాజ్, మున్నా, ప్రదీప్, బాలస్వామి, యాదగిరి, వాసు, మధులత, రేణుక, స్వప్న, పద్మ, రవి, మౌలానా తదితరులు పాల్గొన్నారు.