కుత్బుల్లాపూర్, జూలై 31: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే మా ఎజెండా అని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆదివారం నియోజకవర్గానికి చెందిన పలు స్వచ్ఛంద సంఘాలు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ప్రజలు తమ సమస్యలను తెలిపేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు తీసుకున్నారు.
చట్టసభలో 50 శాతం బీసీ రిజర్వేషన్ కోసం విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అన్వర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందించారు.
వరదనీటికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ గాజులరామారం డివిజన్ బాలాజీ లే ఔట్, ప్రిస్టిన్ప్లేస్కు చెందిన సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాన్ని అందించారు.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరుతూ శ్రీవాసవి ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందించారు.
జీడిమెట్ల 132 డివిజన్ ఎంఎన్‌రెడ్డి కాలనీ ఫేస్-1లో రూ.10 లక్షలు వెచ్చించి కమ్యూనీటి హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరి కావడంతో ఎమ్మెల్యేను సంక్షేమ సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
గాజులరామారం డివిజన్ ఆదర్శనగర్‌కి చెందిన ఝాన్సీ లక్ష్మిభాయ్ శ్రీనివాస్‌లకు దళిత బంధు పథకం కింద జిరాక్స్-స్టేషనరీ షాప్ ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే కేపీ ముఖ్యఅతిధిగా హజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
సూరారం డివిజన్ స్కందానగర్లో బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిధిగా హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాచుపల్లి నుంచి మల్లంపేట్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారడంతో దానిని మరమ్మతులు చేయాలని కోరుతూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే నేరుగా వెళ్లి సందర్శించి పరిశీలించారు. రోడ్డు మరమ్మతులకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మియాపూర్ నరేన్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్లో కాపు సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాపుల ఆత్మగౌరవ సభలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, గాంధీ, క్రిష్ణారావులు హజరయ్యారు.