సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : సేవల్లో లోపంతో పాటు వినియోగదారుడికి తీవ్రనష్టాన్ని కలిగించినందుకు రూ.10వేల నష్టపరిహారంతో పాటు రూ.7లక్షల 22వేల 599లు చెల్లించాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ -1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్నతో కూడిన బెంచ్ ఆదేశించింది. సికింద్రాబాద్‌కు చెందిన పీఎస్ పార్థసారధి నిస్సాన్ టెర్రనో కారుకు 2018లో రూ.13,797 ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ చేయించారు. వరదల కారణంగా కారు కొట్టుకుపోయి పూర్తిగా పాడైంది. సంబంధిత కంపెనీకి సమాచారం ఇవ్వగా, సర్వేయర్ వచ్చి నష్టాన్ని అంచనా వేసి మరమ్మతు చేయాల్సిందిగా వర్క్‌షాప్‌కు సూచించారు.
కాగా మరమ్మతుకు రూ.7, 22,599 బిల్లయ్యిందని, చెల్లించాలని వినియోగదారుడిని కోరారు. దీంతో బీమా క్లెయిమ్ చేయాలని ముందే చెప్పానని బాధితుడు పేర్కొన్నారు. అంత డబ్బు చెల్లించకపోవడంతో అక్టోబర్ 2018 నుంచి జనవరి 2020 వరకు రిపేర్ షెడ్డులోనే కారును నిర్బంధంగా ఉంచారు. తర్వాత డబ్బులు పోగుచేసుకొని చెల్లించగా కారును అప్పగించారు. అనంతరం న్యాయం కోసం బాధితుడు వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. కేసు అంశాలను పరిశీలించిన బెంచ్ బాధితుడికి రూ.7, 22,599 చెల్లించడంతో పాటు రూ.10వేలు నష్టపరిహారంగా అందజేయాలని, రూ.5వేలు ఖర్చుల కింద జమచేయాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఆదేశించింది. తమ ఆదేశాలను 45 రోజుల్లోగా పాటించాలని లేదంటే 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది.