అల్లాపూర్, జూలై 30 : కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు అనుకూలంగా సకల సౌకర్యాలతో తీర్చిద్దిదుతానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం అల్లాపూర్, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1300 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్‌పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, వాటర్ బాటిల్, డిక్షనరీలతో కూడిన కిట్లను స్థానిక కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కూకట్పల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పది వేల మంది విద్యార్థులకు తన సొంత నిధులతో ఈ స్కూల్ కిట్లను అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బోయిన్పల్లి, బేగంపేట్ డివిజన్లలో అందజేశామని, ఇవాళ అల్లాపూర్, మోతీనగర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించామని, ఇక మిగిలిన కూకట్‌పల్లిలో కూడా పూర్తి చేస్తామన్నారు.
ప్రతి ఏడాది పేద ప్రజలకు తనవంతు బాధ్యతగా ఏదో విధంగా సహాయ సహకారులు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. వీటితోపాటు రూ.44 లక్షలతో అంబులెన్స్‌లు, 250 మంది వికలాంగులకు త్రిచక్ర వాహనాలు అందించామని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించి వారి భవిషత్‌కు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కిట్లను అందజేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఎకర స్థలంలో బబ్బుగూడలో నూతన పాఠశాల భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా తయారు చేయించిన 14 రకాల వంటకాలతో కూడిన విందు భోజానాన్ని విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి వారిలో స్ఫూర్తిని నింపారు. అంతకు ముందు విద్యార్థులు చేసిన పలు నృత్య ప్రదర్శనలు, ప్రసంగాలు ఎంతగానో ఆకట్టున్నాయి. కూకట్పల్లి ఎంఈవో ఆంజనేయులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
నమ్మకాన్ని వమ్ము చేయను..
ప్రభుత్వ పాఠశాలలో చదవడం ఎంతో గర్వంగా ఉంది. దీనికి తోడు తమను ప్రోత్సహించేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్కూల్ బ్యాగులు, నోట్‌పుస్తకాలు, పెన్నులు, డిక్షనరీలతో కూడిన కిట్లను అందించడం సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తా. –నీలమ్మ,10వ తరగతి విద్యార్థి, బబ్బుగూడ పాఠశాల
కిట్లను అందించడం సంతోషం
ఎమ్మెల్యే సారు స్కూల్ నోట్ పుస్తకాల కిట్లను అందించడం సంతోషంగా ఉన్నది. నేను 5వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివా. 6వ తరగతి నుంచి బబ్బుగూడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న. ఇక్కడ మా టీచర్లు చదువు బాగ చెబుతారు ఇంగ్లిష్ కూడా బాగా నేర్పుతారు. ఎమ్మెల్యే స్ఫూర్తితో ఈసారి మంచి ఫలితాలు సాధించి, టీచర్లకు పాఠశాలకు మంచి పేరును తెస్తాను. – ఆనంద్,10వ తరగతి విద్యార్థి, బబ్బుగూడ ప్రభుత్వ పాఠశాల