సిటీబ్యూరో, జూలై 27 ( నమస్తే తెలంగాణ ) : స్మార్ట్ స్పీకర్ల వినియోగం విరివిగా పెరుగుతున్నది. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా అవి చెప్పిన మాట వింటూ సెకన్లలో ఆచరిస్తాయి. వినోదం నుంచి విజ్ఞానం వరకు ప్రతిది అందిస్తున్నది. అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్‌ను ఇప్పుడు ఎకువ మంది ఉపయోగిస్తున్నారు. తాజాగా స్మార్ట్ స్పీకర్ల వినియోగంపై అమెజాన్ .. కార్వీ ఇన్ సైట్స్ పేరుతో ఒక సర్వే జరిపింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రధాన నగరాల్లోని వినియోగదారులు ప్రతిరోజూ సగటున 2.5 గంటలకు పైగా స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తున్నారని సర్వేలో తేలింది. అంతేకాకుండా దాదాపు స్మార్ట్ స్పీకర్స్ ఉపయోగించే 81 శాతం కుటుంబాల్లోని వ్యక్తులు ప్రతి ఒకరూ యాక్సెస్ చేసేలా అందరికీ అందుబాటులో ఒక గదిలో ఉంచుతున్నారు. ఇక స్మార్ట్ స్పీకర్స్‌ను ఉపయోగించే 55% మంది వినియోగదారులు గతంలో కంటే ఇప్పుడు సంగీతాన్ని బాగా ఆస్వాదించగలుగుతున్నారని కూడా అధ్యయనం తేల్చిచెప్పింది. అమెజాన్ ఎకో వినియోగదారుల సంఖ్య గత రెండేళ్లలో 48 శాతం పెరిగింది. ఈ జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం, గుంటూరు, మెదక్, చిత్తూరు, నెల్లూరు నగరాలు ఉన్నాయి.