బంజారాహిల్స్, జూలై 27: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 58, 59 దరఖాస్తుల పరిశీలన ముమ్మరంగా సాగుతోంది. షేక్‌పేట మండల పరిధిలో జీవో నంబర్ 58 కింద 1586 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన అధికారుల బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలను సేకరించాయి. దరఖాస్తుదారు పేర్కొన్న వివరాల ప్రకారం ఆయా స్థలాల్లో నిర్మాణాలు ఉన్నాయా? క్షేత్ర స్థాయిలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా? అనే విషయాన్ని తెలుసుకున్నారు. జీవో నంబర్ 58 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తవడంతో కోర్టు కేసులు, నాలా స్థలాలు, శిఖం భూములు లేని ప్రాంతాల్లో అభ్యంతరం లేని స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు నివేదికలు పంపించారు. క్షేత్ర స్థాయి పరిశీలన నివేదికలను క్రమబద్ధీకరణ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 2014 కంటే ముందుగా ఆయా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉన్న వారికే క్రమబద్ధీకరణ అవకాశం కల్పిస్తున్నట్లు జీవో నంబర్ 58లో పేర్కొన్నారు. దాని తర్వాత స్థలాలను కొనుగోలు చేసిన వారికి, నోటరీతో కొనుగోలు చేసిన వారికి క్రమబద్దీకరణ అవకాశం లేదని అధికారులు తెలిపారు. జీవో నంబర్ 59 కింద సుమారు 1450కిపైగా దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికలు రూపొందించాల్సి ఉంది.
దరఖాస్తుల పరిశీలన పూర్తి
మా పరిధిలో జీవో నంబర్ 58 కింద మొత్తం 1586 క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఎన్ని గజాల్లో నివాసం ఉంటున్నారనే విషయంతో పాటు దరఖాస్తులో సూచించిన వివరాలను సేకరించాం. క్రమబద్ధీకరణ కమిటీ ప్రతిపాదనలు సిద్ధ్దం చేసిన తర్వాత సీసీఎల్ఓ ఆమోదం కోసం పంపిస్తాం. తర్వాత అర్హులందరికీ క్రమబద్ధీకరణ జరుగుతుంది. జీవో నంబర్ 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన చేస్తున్నాం.
– రామకృష్ణ నాయక్, షేక్‌పేట తహసీల్దార్