ఎర్రగడ్డ, జూలై 27: దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల కోసం సంక్షేమ పథకాలను అమలుపర్చుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం బోరబండ డివిజన్‌కు చెందిన ‘దళితబంధు’లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న దళితబంధు పథకానికి అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. వ్యాపారాలకు పెట్టుబడులు లేక, ఉపాధి కరువై అయోమయంలో ఉన్న దళితులను ఈ పథకం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసే ముఖ్యమంత్రి ఉండటం మనందరి అదృష్టమన్నారు. దళిత బంధు పథకానికి బోరబండతో పాటు నియోజకవర్గంలోని మిగతా డివిజన్ల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారని, దశల వారీగా అర్హులైన అందరినీ లబ్ధిదారులుగా చేర్చటం జరుగుతుందని హామీ ఇచ్చారు. అంతకు ముందు లబ్ధిదారులైన వసంతరావు, కాంతమ్మలకు కార్ల తాళాలను ఎమ్మెల్యే గోపీనాథ్ అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్‌ఛార్జి సయ్యద్సిరాజ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ధర్మ, నేతలు మధు, యాదయ్య, ఫజల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
వెంగళరావునగర్, జూలై 27: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం శ్రీనగర్ కాలనీ జయప్రకాష్ నగర్లో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని.. అందులో భాగంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా చేపడుతున్నామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, కమ్యూనిటీహాళ్లు, బస్తీ దవాఖానాలు నిర్మించామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను చేపట్టి అందరి ఆదరణ చూరగొంటుందన్నారు. అనంతరం కార్పొరేటర్ సంగీ త శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ.. అభివృద్ది పనులను త్వరలో పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అప్పూఖాన్, నాయకులు తన్నూఖాన్, మధు యాదవ్, సంతోష్, నాగమణి, శిరీష, కాలనీ వాసులు పాల్గొన్నారు.