జవహర్‌నగర్,జూలై 27: జవహర్‌నగర్ కార్పొరేషన్లో పరిధిలోని డంపింగ్‌యార్డులో రాంకీసంస్థ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. జవహర్‌నగర్, దమ్మాయిగూడ ప్రాంతంలో వ్యర్థ జలాలతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారని, వారికి శాశ్వత పరిష్కారం చూపాలని మంత్రి మల్లారెడ్డి అధికారులను ఆదేశించారు. దమ్మాయిగూడలోని కొన్ని ప్రాంతాల్లో డంపింగ్‌యార్డు నుంచి వచ్చే వ్యర్థనీరు, వరుసగా కురుస్తున్న వర్షంతో రోడ్లన్నీ కొట్టుకుపోయాయని, నివాసితులు కలుషిత నీటితో అనారోగ్యాల బారిన పడి దవాఖానల పాలవుతున్నారని, దీని తీవ్రతతో ప్రజలు విసుగుచెందారని, తక్షణమే వ్యర్థ జలాలను ఆపాలని మంత్రి అధికారులకు సూచించారు.
జవహర్‌నగర్ ప్రజలను కాపాడండి
డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలైన 17, 18, 19 డివిజన్లలో వ్యర్థ జాలాలు అధికంగా ఇండ్లల్లోకి వస్తున్నాయని, తీవ్రమైన దుర్వాసనతో ప్రజలు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. గత కొనేండ్లుగా డంపింగ్ యార్డ్ నుంచి దుర్వాసన…వ్యర్థ నీటితో తీవ్రమైన అవస్థలు పడుతున్నామని, ఈ నీటిని నోట్లో పోసుకోలేమని అలాగే స్నానాలకు వాడుకోలేమన్నారు.బోర్లు వేసినా కూడా కలుషిత నీరే వస్తుంన్నారు. డంపింగ్ యార్డు అధికారులు మాటలకే పరిమితం అవుతున్నారని… చేతల్లో మాత్రం శూన్యం అని గతంలో శాశ్వత పరిష్కారం చేస్తామని ఉచిత హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్, నాగారం మున్సిపల్ ఛైర్మన్ చంద్రారెడ్డి మంత్రి చామకూర మల్లారెడ్డి ఎదుట బాహటంగానే మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి చుట్టుపక్కల కాలనీలకు తాగునీటి వసతి కల్పించి తక్షణమే కలుషిత జలాలు రాకుండా చర్యలు తీసుకోవాలని డంపింగ్ యార్డు అధికారులకు సూచించారు.
రూ. 30కోట్లు మంజూరు చేయండి…
దమ్మాయిగూడ, జవహర్‌నగర్ ప్రాంతాలకు డంపింగ్‌యార్డు యాజమాన్యం, హెచ్ఎండీఏ అధికారులు రూ. 30కోట్లు మంజూరు చేసి కాలనీలను బాగుచేసి, తాగు నీటి వసతి కల్పించాలని మంత్రి ఆదేశించారు.
త్వరలోనే వ్యర్థ జలాలు.. తాగునీరుగా…
వ్యర్థ జలాలను ఫిల్టర్ చేసి తాగునీటిగా మారుస్తున్నామని, ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని త్వరలోనే అందుబాటులోకి వస్తోందని డంపింగ్ యార్డు అధికారులు అన్నారు. పూర్తిగా చెత్తతో కలుషితమైన నీటిని శుద్ధమైన నీరుగా తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు, జవహర్‌నగర్ కమిషనర్ జ్యోతిరెడ్డి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్లు వాణిదేవి, జవహర్‌నగర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, దమ్మాయిగూడ, నాగా రం నాయకులు పాల్గొన్నారు.