కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 27 : జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను చెల్లించని బకాయిదారులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) ఆఫర్ వరంగా మారనుంది. ఏండ్ల తరబడి పన్నులు చెల్లించని బకాయిదారులకు ఆస్తిపన్నులతో పాటు వడ్డీభారం పెరగడంతో ఆ బకాయి పన్నులు చెల్లించడానికి వెనుకంజ వేస్తున్నారు. కోర్టు కేసులు, ఇతరాత్ర కారణాలతో ఆస్తిపన్నులు చెల్లించని బకాయిదారులకు ఓటీఎస్ ఆఫర్‌తో వడ్డీని 90శాతం రద్దు చేస్తూ మిగిలిన బకాయిలను చెల్లిస్తే చాలని ప్రకటించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని బకాయిదారులందరికీ మేలు జరుగనుంది. ఇప్పటికే బకాయి ఆస్తిపన్నులు చెల్లించిన వారికి కూడా ఈ ఆఫర్‌ను వర్తింపజేస్తూ రానున్న రోజుల్లో ఆస్తిపన్ను చెల్లింపులలో సర్దుబాటు చేయనుంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మూసాపేట సర్కిల్ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.
రూ.14.58 కోట్లు మాఫీ..
మూసాపేట సర్కిల్లోని ఐదు వార్డులలో 77,185 అసెస్మెంట్లు ఉండగా గతేడాది రూ.87 కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూళ్లయ్యాయి. ఆస్తిపన్ను సక్రమంగా చెల్లించని బకాయిదారులు 11,394 మంది ఉన్నట్లు గుర్తించారు. రూ.28.08 కోట్లు ఆస్తిపన్నులు వసూళ్లు కాలేదు. జీహెచ్ఎంసీ తాజాగా కల్పించిన వన్‌టైమ్ సెటిల్మెంట్ ఆఫర్‌తో మూసాపేట సర్కిల్లో రూ.14.58 కోట్ల వడ్డీ మాఫీ కానుంది. ఆస్తిపన్ను బకాయిలకు చెందిన రూ.16.20 కోట్లకు తొంభై శాతం వడ్డీ మాఫీ లభించింది. ఈ ఓటీఎస్ ఆఫర్లో బకాయిదారుల నుంచి కేవలం రూ.1.62 కోట్ల వడ్డీ మాత్రమే జీహెచ్ఎంసీ ఖజానాకు చేరనుంది.
విస్తృతంగా అవగాహన..
జీహెచ్ఎంసీ కల్పించిన ఓటీఎస్ ఆఫర్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అక్టోబర్ 31లోగా బకాయిలను చెల్లిస్తేనే తొంభై శాతం వడ్డీ మాఫీ ఉంటుంది. సర్కిల్ పరిధిలో మొండి బకాయిదారులను గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఆస్తిపన్ను బకాయిదారులకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర సందేహాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ, ఇతర విభాగల సిబ్బందితో కలిసి బకాయిలను వసూలు చేస్తున్నాం. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుతున్నాం.
-కె.రవికుమార్, ఉప కమిషనర్, మూసాపేట సర్కిల్