సుల్తాన్‌బజార్, జూలై 27. జంట జలాశ యాలు నిండటంతో అధికారులు గేట్లను ఎత్తివేయడం వలన మూసీ ఉధృతంగా ప్రవహించింది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అప్రమత్తం చేశారు. మూసీ పరీవాహకంలో వారి నివాసాలను ఖాళీ చేయించేందుకు అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వారు ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలివెళ్లారు. వరద నీటి ఉధృతి పెరిగి ఎంజీబీఎస్ వంతెనను తాకుతూ ప్రవహించింది. వరద నీరు కేవలం వంతెనను తాకుతూ ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్‌లోకి రాకపోకలు కొనసాగాయి.
అధికారుల సందర్శన..
జంట జలాశయాలు వరద నీటితో నిండటంతో వరద నీటిని గేట్లు ఎత్తి వదలడంతో మూసీలో వరద నీరు పరవళ్లు తొక్కింది. దీంతో నాంపల్లి తహసీల్దార్ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్‌తో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. పరీవాహక ప్రాం తంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టారు. నయాపూల్ వంతెన వద్ద నుంచి శివాజీ వంతెన, చాదర్‌ఘాట్ వంతెన వరకు రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్‌శాఖ వారు తమ బృందాలతో అప్రమత్తంగా ఉంటూ మూసీ వైపు ఎవరినీ పోనీయకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పురానాపూల్ వద్ద మూసీ నదిలో పడ్డ వ్యక్తిని ప్రాణాలకు తెగించి హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ సైదాబాబు, మంగళ్‌హాట్ ఎస్సై రాంబాబు కాపాడి వైద్య చికిత్సల నిమిత్తం దవాఖానకు తరలించారు.ప్రస్తుతం ఆ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.