చాంద్రాయణగుట్ట,/చార్మినార్ జూలై 25 : నగరం సందడిగా మారింది. ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా సోమవారం ఘటాలు, అంబారీ ఊరేగింపులు కనుల పండువగా సాగాయి. ఆ ఘట్టాలను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. తల్లి.. చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
అమ్మా బైలెల్లినాదో .. తల్లి బైలెల్లినాదో.. అంటూ డీజేల మోత.. డప్పుల దరువు, పోతరాజులు, యువత నృత్యాల మధ్య తొట్టెల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. పాతనగరంలో లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా సోమవారం అమ్మవారి ఘటాల ఊరేగింపు కొనసాగింది. మొదట హరిబౌలి శ్రీఅక్కన్నమాదన్న దేవాలయంలో అమ్మవారు అంబారీపై దర్శనమిచ్చారు.
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభించారు. లాల్‌దర్వాజ మోడ్ శాలిబండ మీదుగా చార్మినార్ కేంద్రంగా అమ్మవారి ఊరేగింపు నయాపూల్ ఢిల్లీ దర్వాజ వరకు సాగింది. వివిధ ప్రాంతాలకు చెందిన మొత్తం 26 అమ్మవారి ఘటాలు ఊరేగింపులో పాల్గొని భక్తులకు దర్శనమిచ్చాయి. అంతకుముందు అక్కన్నమాదన్న ఆలయంలో కమిషనర్ సీవీ ఆనంద్, ఆయన సతీమణి లలితా ఆనంద్ ప్రత్యేక పూజలు చేశారు. బందోబస్తులో నగర అదనపు సీపీ డీఎస్ చౌహాన్, జాయింట్ సీపీలు రంగనాథ్, కార్తికేయ, విశ్వప్రసాద్, డీసీపీ సాయి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
హిందువులమని చెప్పుకునే పార్టీలు ఏం చేశాయో చెప్పాలి: మంత్రి సబిత
బడంగ్‌పేట, జూలై 25 : మేము హిందువులమని చెప్పుకునే పార్టీలు తెలంగాణలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారని, అందుకు యాదాద్రియే ఉదాహరణగా చెప్పారు. సోమవారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కమలానగర్, జిల్లెలగూడ పాతబస్తీలో జరిగిన ఫలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పి.కౌసిక్ రెడ్డి, అర్కల కామేశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మత సామరస్యానికి పాత నగరం ప్రతీక
సైదాబాద్, జూలై 25 : బోనాల ఉత్సవాల్లో భాగంగా జయదుర్గాదేవి ఆలయం అధ్యక్షుడు, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సైదాబాద్‌లో నిర్వహించిన తొట్టెలు, ఫలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పర్వదినాలకు ఆధిక ప్రాధాన్యతనిస్తూ.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నదన్నారు. మతసామరస్యానికి పాతనగరం ప్రతీక అని, అన్ని కులాలు, మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సైదాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కావేటి ధర్మరాజు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఎన్ రాజు, తుమ్మలపల్లి రవీందర్, పొదిళ్ల శ్రీధర్, కావేటి విక్రమ్, నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
నా ఉగ్రరూపం తట్టుకోలేరు
లాల్‌దర్వాజ అమ్మవారిని సాయంత్రం 6.45 నిమిషాలకు మతంగి అనురాధ దర్శించుకున్నారు. అనంతరం భవిష్యవాణి (రంగం)వినిపించారు. “మీ ఆర్భాటాల కోసం నాకు ఇష్టం లేని పూజలు చేస్తున్నారు. నా ఉగ్రరూపం భక్తులు తట్టుకోలేరు. అందరూ నా బిడ్డలే.. అని క్షమిస్తున్నా. ఇటీవల భారీ వర్షాలు కురిసినా.. ప్రాణనష్టం కలుగకుండా చూశాను. నా దగ్గరకు మనస్ఫూర్తిగా వచ్చి మొక్కుతే శుభాలు కలుగుతాయి. గొడవలు మంచిది కాదు. మీరు ఎన్ని తప్పులు చేసినా.. రక్షించుకుంటూ వస్తున్నా. ఐదు వారాలు ఇండ్లలో నుంచి గడదీపాలు తెచ్చి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే అంత మంచే జరుగుతుంది” అని అనురాధ భవిష్యవాణిలో వినిపించారు.
– భవిష్యవాణి వినిపించిన అనురాధ
బోనాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు
చార్మినార్ వద్ద సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఊరేగింపు ర్యాలీకి స్వాగతం పలికి ప్రసంగించారు. భాగ్యనగర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపునకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. బోనాల ఉత్సవాల కోసం ప్రతి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు అందజేసిందని తెలిపారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేశ్ తివారి బోనాల ఉత్సవాలకు మరింత వన్నె తీసుకువచ్చేందుకు కృషి చేశారని ప్రశంసించారు. ఊరేగింపులో పాల్గొన్న పలు దేవాలయాల ప్రతినిధులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించి అమ్మవారి చిత్రపటాలను అందించారు.