సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సంబధిత శాఖ అధికారులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అమయ్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా రంగారెడ్డిలో కూడా వ్యాధులు సోకకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో డెంగీ, మలేరియా, అతిసారం వంటి విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా, నాణ్యమైన భోజనం అందే విధంగా ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలన్నారు.
వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ఈగలు, దోమలు, బొద్దింకలు, పురుగుల నివారణ కోసం అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులను అవలంబించాలన్నారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి, నియంత్రణ ప్రభుత్వ, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలలో ముందస్తు చర్యలపై సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఇతర శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో పాటు సీఎస్ సోమేశ్ కుమార్లో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కలెక్టర్ ఆమోయ్ కుమార్ పాల్గొన్నారు. వ్యాధుల వ్యాపి,్త నియంత్రణ గురించి జిల్లా అధికారులను ఆదేశించారు.