సికింద్రాబాద్, జూలై 25: బోయిన్పల్లి టాటా కార్ షోరూమ్‌లో భారీ చోరీ జరిగింది. ఈ షోరూమ్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పాటు భద్రతకు ఒకేఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకున్నారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. బోయిన్‌పల్లిలోని మాలిక్ టాటా కార్ షోరూమ్ నిర్వహణ బాధ్యతలను ఏజీఎం రంజిత్ కుమార్ చూస్తున్నారు. శనివారం రాత్రి క్యాషియర్ శ్రీనివాస్ షోరూమ్ మొదటి అంతస్తులో ఉన్న క్యాష్ కౌంటర్లోని లాకర్లో రూ. 10 లక్షలు పెట్టి, తిరిగి లాక్ చేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆదివారం, బోనాలు ఉండటంతో సాయంత్రం 6 గంటలకే షోరూమ్ మూసివేసి అందరూ వెళ్లిపోయారు. సోమవారం ఉదయం షోరూమ్‌కు వచ్చిన హౌస్ కీపింగ్ వర్కర్లు పారిశుధ్య పనుల్లో నిమగ్నమయ్యారు. క్యాషియర్ శ్రీనివాస్ కూడా వచ్చాడు.
సిబ్బందితో క్యాష్ కౌంటర్‌ను శుభ్రం చేయించేందుకు అతడు మొదటి అంతస్తుకు వెళ్లాడు. క్యాష్ కౌంటర్, క్యాబిన్ తీసి ఉండటంతో పాటు లాకర్ తెరిచి ఉంది. లాకర్లో దాచిన రూ. 10 లక్షలు కూడా కనిపించలేదు. కంగుతిన్న క్యాషియర్ శ్రీనివాస్ చోరీ జరిగినట్టు గ్రహించి, లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయాన్ని ఏజీఎం రంజిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లాడు. హుటాహుటిన షోరూమ్‌కు వచ్చిన రంజిత్ కుమార్ వెంటనే బోయిన్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీమ్ సందర్శించింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షోరూమ్‌ను బోయిన్పల్లి సీఐ రవికుమార్‌తో కలిసి బేగంపేట ఏసీపీ పృథ్వీధర్ రావు, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించి, షోరూమ్ నిర్వాహకులను ప్రశ్నించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలంటూ బోయిన్పల్లి పోలీసులు గతంలో పలుమార్లు షోరూమ్‌కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇదే క్రమంలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కేసు దర్యాప్తు చేస్తున్నారు.