వనస్థలిపురం/ హిమాయత్‌నగర్, జూలై 25: వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దగౌని సతీశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. వనస్థలిపురం, హిమాయత్‌నగర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలె పేరును గురుకులాల నుంచి తొలగించాలనడం అవివేకం అని అన్నారు. అగ్రవర్ణాలకు చెంచాగా మారి బీసీలను తాకట్టుపెడుతున్నాడని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల కోసం ఫూలె చేసిన పోరాటాలు దేశం ఉన్నంత వరకు ఉంటాయన్నారు. అలాంటి మహానుభావుడి పేరు తీసేయాలనడం మూర్ఖత్వమన్నారు. చెంచాగిరితో పదవులు సంపాదిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే సహించమన్నారు. 48 గంటల్లో ఫూలె విగ్రహం వద్ద బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 27 ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు.