కాచిగూడ, జూలై 25: దేశంలోని 75 కోట్ల మంది బీసీల పక్షాన నిలబడి ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే, అది జీర్ణించుకోలేని కొంత మంది అజ్ఞానులు బీసీల ఆశాజ్యోతి ఆర్.కృష్ణయ్యపై పసలేని ఆరోపణాలు చేస్తున్నారని, అలాంటి ఎత్తుగడులను సహించేదిలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అన్నారు. కాచిగూడ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్తో కలిసి గుజ్జ కృష్ణ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల పేర్లను బీసీ గురుకుల పాఠశాలలుగా మారిస్తే సంక్షిప్తంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఉచ్ఛరించడానికి అనువుగా ఉంటుందని ఆర్.కృష్ణయ్య అన్నారని పేర్కొన్నారు.
47 ఏండ్లుగా బీసీ సమస్యలపై 12 వేల పైగా ఉద్యమాలు చేసిన నేత కృష్ణయ్యను విమర్శించడం అవివేకమని వారు ఆరోపించారు. ఆర్.కృష్ణయ్య ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది వ్యక్తులు బురద చల్లడం అవివేకమైన చర్య అని, దీని వెనుక రాజకీయ నాయకుల కుట్ర దాగి ఉందని, త్వరలో వాస్తవాలను వెలికి తీస్తామని వారు హెచ్చరించారు. బీసీ సమస్యలపై దేశ ప్రధానినే ఎదిరించిన ఉద్యమ నేత కృష్ణయ్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, జిల్లపల్లి అంజి, చంటి ముదిరాజ్, బాలాజీ, ఉదయ్, జయంతి గౌడ్, బబ్లూగౌడ్, బాల్రాజ్, నిఖిల్, పృథ్వీరాజ్ పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.