చాంద్రాయణగుట్ట /చార్మినార్, జూలై 24 : బోనాల జాతరతో ఆదివారం పట్నమంతా శోభాయమానంగా మారింది. భాగ్యనగరి వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చిన భక్తులతో ఆలయాల పరిసరాలు కళకళలాడాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపుతో నగర వ్యాప్తంగా బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. లాల్‌దర్వాజ, దర్భార్ మైసమ్మ, ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవార్లకు పట్టువస్ర్తాలు, బోనం సమర్పించారు. మరోవైపు గోల్కొండ, లష్కర్, లాల్‌దర్వాజ పరిసరాలు కూడా బోనాలు, ఘటాలతో సందడిగా మారాయి. కొద్ది రోజులుగా నగరంపై ప్రతాపం చూపుతున్న వరుణుడు కాస్త శాంతించడంతో బోనాల వేడుకలకు భక్తులు పోటెత్తారు. మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయాలకు తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీఐపీలు, వీవీఐపీలు, నాయకులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఆదివారం కనుల పండువగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టువస్ర్తాలతో పాటు బంగారు బోనం సమర్పించారు. హోంమంత్రి మహమూద్ అలీ, గ్రేటర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు ఎం.అంజన్‌కుమార్ యాదవ్, గీతారెడ్డి, వి.హన్మంత రావు, ఫిరోజ్‌ఖాన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యరెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి ఎస్.నంద, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత నాయక్, జోగిని శ్యామల అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
మాజీ మంత్రి దేవేందర్‌గౌడ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించారు. గౌలిపురాలోని శ్రీ భరతమాత మాతేశ్వరీ మహంకాళి అమ్మవారికి బీజేపీ నాయకురాలు విజయశాంతి స్థానిక కార్పొరేటర్ అలె భాగ్యలక్ష్మితో కలిసి బోనం సమర్పించారు. పాతనగరంలోని ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు పట్టువస్ర్తాలను అందించి అమ్మవార్లను దర్శించుకున్నారు.
అమ్మవారి దయతో వర్షం ఆగింది:దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం వేదికపై నుంచి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకున్నాయని తెలిపారు. అమ్మవారు కరుణించి పండుగపూట వర్షం పడకుండా దయచూపారని, భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకుంటున్నారని అన్నారు.
బోనాల ఉత్సవాలు విశ్వవ్యాప్తం:మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..
బోనాల జాతర ఉత్సవాలు ఒక్క తెలంగాణలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా నిర్వహించడం గర్వకారణం అన్నారు. ఏ దేశంలో జరుగని విధంగా ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద జాతరను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో పండుగకు మరింత గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఉత్సవాలకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందుతున్నదని ఆయన స్పష్టం చేశారు.
గోల్కొండ కోటలో 8వ బోనం
మెహిదీపట్నం జూలై 24: గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, ఈవో శ్రీనివాస్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం 8వ పూజ జరిగింది. నగర వ్యాప్తంగా బోనాలు ఉన్నా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా గోల్కొండ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మైత్రికమిటీ అధ్యక్షుడు రాజువస్తాద్ చర్యలు చేపట్టారు.
నేడు తొట్టెల ఉరేగింపు
ఆదివారం నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం పాతనగరంలోని అక్కన్నమాదన్న ఆలయం నుంచి వేలాది మంది భక్తజన సందోహం నడుమ అంబారీపై తొట్టెల ఊరేగింపు నిర్వహించనున్న నేపథ్యంలో నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.