తెలుగు యూనివర్సిటీ, జూలై 24: బీసీ ఉద్యోగులపై ఉన్న క్రిమిలేయర్ నిబంధనను తొలగించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కోరారు. తెలంగాణ బీసీ టీచర్ల సంఘం సమావేశం బిర్లా ఆడిటోరియంలో ఆదివారం సంఘం అధ్యక్షులు కె.కృష్ణుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని ఆయన కోరారు. ఉద్యోగులు ఐకమత్యంతో ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మిలిటెంట్ రూపంలో ఉద్యమం చేయడానికి బీసీలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభు త్వం బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సం ఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, సభ్యులు విజయ కుమార్, రాములు, శ్రీనివాసులు, సంజీవయ్య గౌడ్, తిరుపతయ్య, మల్లికార్జున, లాల్‌కృష్ణ పాల్గొన్నారు.