సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): హనుమాన్ గ్యాస్ ఏజెన్సీ ఫోన్ నంబర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన చాంద్రాయణగుట్ట వాసికి.. సిలిండర్ డెలివరీ బాయ్‌గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు లక్ష రూపాయలు టోకరా వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు గ్యాస్ ఏజెన్సీ నంబర్ కోసం గూగుల్ సెర్చ్ చేశాడు. అందులో ఒక నంబర్ లభించింది. ఆ నంబర్‌కు ఫోన్ చేయగానే.. నేను సిలిండర్ డెలివరీ బాయ్‌ని, మీరు ఫలానా నంబర్‌కు ఫోన్ చేయండి.. అంటూ మరో నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు కాల్ చేయగానే మీ కన్జూమర్ నంబర్ చెప్పండి.. అంటూ సదరు వ్యక్తులు సూచించారు. తన వద్ద నంబర్ లేదంటూ బాధితుడు చెప్పగానే ఫోన్ కట్ చేశారు. తిరిగి ఐదు నిమిషాల వ్యవధిలో మరో నంబర్‌తో బాధితుడికి ఫోన్ వచ్చింది. మేం హనుమాన్ గ్యాస్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసింది క్యాన్సల్ అయ్యింది.. మీరు ఫిర్యాదు చేస్తే 30 నిమిషాల్లోనే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తాం.. అని సూచిస్తూ ఒక లింక్‌ను పంపించారు.
ఆ లింక్ క్లిక్ చేయగానే ఫోన్ నంబర్, బ్యాంకు వివరాలు నింపాలని సూచించారు. ఆ తర్వాత ఫిర్యాదు చార్జీల కింద రెండు రూపాయలు ఆన్లైన్లో చెల్లించాలంటూ సూచించడంతో బాధితుడు అలాగే చేశాడు. దీంతో కొద్ది సేపటికీ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, మీకు వచ్చిన మెసేజ్‌ను మరో నంబర్‌కు పంపించండి.. అంటూ సూచించారు. ఆ సందేశాన్ని ఇంకో నంబర్‌కు పంపించడంతోనే వెంట వెంటనే అతడి ఖాతాల్లోంచి డబ్బులు డ్రా అవుతున్నట్లు మెసేజ్‌లు వచ్చాయి. బాధితుడు ఖాతాలో ఉన్న రూ. 99 వేలను నేరగాళ్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు.
ఏఈఈ గూగుల్ డ్రైవ్ హ్యాక్బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న సైబర్ చీటర్స్
ఢిల్లీలో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి గూగుల్ డ్రైవ్‌ను హ్యాక్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుండటంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దోమలగూడకు చెందిన బాధితుడు వాటర్ రీసోర్సెస్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు యూపీఎస్సీ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్ల్లి వాజిరామ్, రవి ఇనిస్టిట్యూట్లలో రూ. 2.22 లక్షల వరకు చెల్లించి, తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. అతడి గూగుల్ డ్రైవ్ హ్యాక్ అయ్యింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు తన గూగుల్ డ్రైవ్‌ను హ్యాక్ చేసి, ఈ మెయిల్స్‌లో ఉన్న తన వ్యక్తిగత ఫొటోలు, సమాచారాన్ని తస్కరించారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ సమాచారంతో తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, ఫొటోలు అశ్లీల వెబ్సైట్లలో పెడుతామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేపట్టారు.