సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): అర్హత లేకున్నా ప్రైవేట్ వైద్యశాలల్లో ప్రజలకు చికిత్స చేస్తూ వైద్యులుగా బిల్డప్ ఇచ్చే నకిలీ వైద్యులపై ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు దృష్టి పెట్టారు. రెండు రోజుల కిందట ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు మందమల్లమ్మ చౌరస్తాలో ఉన్న ఆర్కే దవాఖానలో ఫిజిషియన్‌గా పనిచేస్తున్న నకిలీ వైద్యుడు విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దవాఖానల్లో కంపౌండర్లు, అటెండర్లు, వార్డు బాయ్‌లుగా పనిచేసి, మెడికల్ వృత్తిపై కొంత అవగాహన ఉన్న కొందరు ఆర్ఎంపీలుగా అవతారమెత్తుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఎంబీబీఎస్, ఎండీ చదివినట్లు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించి, ప్రైవేట్ దవాఖానల్లో వైద్యం చేస్తున్నారు.
విదేశాల్లో ఎంబీబీఎస్, ఎండీ చదివిన వారి సర్టిఫికెట్లను పరిశీలించేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో విదేశాలు, వేర్వేరు యూనివర్సిటీల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు సంపాదిస్తున్న కొందరు వైద్యులుగా అవతారమెత్తుతున్నారు. ఇలాంటి వాళ్లకు కొన్ని ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు కూడా ఉద్యోగాలిస్తున్నాయి. ఈ నకిలీ వైద్యులతోనే చికిత్స చేయిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నకిలీ వైద్యులు ఉంటే వాళ్ల సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. నకిలీ వైద్యులపై హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, రాచకొండ, సైబరాబాద్‌లోని ఎస్వోటీ బృందాలు దృష్టి పెట్టాయి. నకిలీ సర్టిఫికెట్లతో ప్రజలకు వైద్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నాయి.