బేగంపేట, జూలై 24: ఆస్తి కోసం కన్న తండ్రిని కసాయి కొడుకు కొడవలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన ఆదివారం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కథనం ప్రకారం.. విమన్నగర్లో ఉంటున్న అబ్రహం లింకన్ (84) ఎక్స్ సర్వీస్‌మెన్. అతడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య మహబూబ్‌నగర్‌లో ఉండగా, రెండో భార్య శేరిలింగంపల్లిలో ఉంటుంది. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు. ఇందులో ఇద్దరు చనిపోగా మొదటి భార్య, కూతురు మాత్రమే ఉన్నారు. రెండో భార్యకు కొడుకు, కూతురు ఉన్నారు. అయితే, కొంత కాలంగా అబ్రహంను కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో బేగంపేటలోని విమన్నగర్లో ఉన్న రాహుల్ క్యాటరింగ్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అబ్రహం ఆర్మీలో పని చేసిన సమయంలో అతడికి షాద్‌నగర్‌లో నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ఇచ్చారు.
దీంతోపాటు శేరిలింగంపల్లిలో అతడి పేరుతో 400 గజాల స్థలం కూడా ఉంది. అయితే, తండ్రికి తెలియకుండా రెండో భార్య కుమారుడు కిరణ్ (30) నకిలీ పత్రాలతో గిఫ్ట్‌డీడ్ తయారు చేసి 400 గజాల స్థలాన్ని రూ.70 లక్షలకు విక్రయించాడు. కొంత కాలం తర్వాత కొడుకు భూమిని విక్రయించిన విషయం అబ్రహంకు తెలిసింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో షాద్‌నగర్‌లో ఉన్న భూమి కూడా తనకు రాసి ఇవ్వాలని తండ్రితో కిరణ్ గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం బేగంపేట విమన్నగర్లో ఉంటున్న తండ్రి వద్దకు కిరణ్ వచ్చి మరోసారి ఘర్షణ పడ్డాడు. దీంతో పక్కనే ఉన్న కొడవలితో తండ్రి మెడపై బలంగా కొట్టాడు. అనంతరం కిరణ్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స కోసం అతడిని సమీపంలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.