ప్రైవేటు దవాఖానలు, క్లినిక్లకే పరిమితమైన ఈవినింగ్ ఓపీ సేవలు.. ఈనెల 25 నుంచి గ్రేటర్‌వ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్‌జే, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి తదితర దవాఖానల్లో ఓపీ సేవలకు రోగుల తాకిడి పెరుగుతోంది. డాక్టర్లను కలిసి వైద్య పరీక్షలు, నమూనాలు ఇవ్వడం, రిపోర్టులు తీసుకునేందుకు రెండుమూడుసార్లు రావాల్సి వస్తోంది. వ్యయప్రయాసలవుతుండడంతో వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించి అన్ని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ ఓపీ ప్రారంభించాలని ఆదేశించారు. సోమవారం నుంచి (4 గంటల నుంచి 6 వరకు) ఈ సేవలు ప్రారంభం కానుండగా.. నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈవినింగ్ క్లినిక్ సదుపాయం ఇప్పటికే నిమ్స్ దవాఖానలో కొనసాగుతోంది.
సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఇక నుంచి గ్రేటర్‌లోని అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంకాలం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణులు, చిన్నపిల్లలు, బాలింతలు, వృద్ధులు పడుతున్న అవస్థలను గమనించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంకాలం కూడా ఓపీ సేవలను ప్రారంభించాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 25నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో సాయంకాలం 4గంటల నుంచి 6గంటల వరకు క్లినిక్‌ల ద్వారా ఓపీ సేవలను అందించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం కొందరు, సాయంత్రం కొందరు వైద్యనిపుణులు ఓపి సేవలు అందించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈవినింగ్ క్లినిక్ సదుపాయం ఇప్పటికే నిమ్స్‌లో కొనసాగుతోంది.