మియాపూర్, జూలై 21 : ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. ఈ మేరకు వాటి వసూళ్ల ప్రక్రియ వేగవంతం అయ్యేలా.. బకాయిదారులకు ఆర్థిక భారం తగ్గేలా ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను తాజాగా ప్రకటించింది. ఈ నెల 17 వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు ఈ పథకం అమలులో ఉండగా.. బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ అధికారులు బకాయిల వసూళ్లపై కసరత్తును ప్రారంభించారు. ఇందుకోసం బల్దియా ప్రకటించిన షెడ్యూల్లో భాగంగా ఆయా విభాగాలను వసూళ్లలో రంగంలోకి దింపుతున్నారు. బకాయిదారులకు ప్రత్యక్షంగా ఫోన్లు చేస్తూ.. సదరు సంస్థ ఆస్తిపన్ను బకాయి.. ఓటీఎస్‌ను వినియోగించుకోవటం ద్వారా వారిపై తగ్గే భారాన్ని వివరిస్తున్నారు. సంక్షిప్త సందేశాలను సైతం పంపుతున్నారు.
సర్కిల్ వ్యాప్తంగా రూ.48 కోట్ల బకాయిలు..
ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై దృష్టి సారించిన అధికారులు.. సర్కిళ్ల పరిధిలో వాటి లెక్కలను తేలుస్తున్నారు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా ఏండ్ల తరబడి రూ.48 కోట్ల మేర ఆస్తి పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. సర్కిల్లో టాప్ 20 బకాయిదారులను గుర్తించి సర్కిల్ డీసీ సహా ఆయా విభాగాల ఉన్నతాధికారులొక్కొక్కరికీ నాలుగు బకాయి దారుల వసూళ్ల బాధ్యతను అప్పగించారు. దీంతో తమకు కేటాయించిన వారికి డీసీ సుధాంశ్ సహా అధికారులు స్వయంగా ఫోన్లు చేస్తున్నారు. సదరు సంస్థ బకాయి సహా ఓటీఎస్ వినియోగించుకోవటం ద్వారా కలిగే ఆర్థిక ప్రయోజనాన్ని వివరిస్తున్నారు. దీనికి తోడు రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బంది సైతం వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ పెండింగ్ బకాయిలను చెల్లించాలంటూ చెబుతున్నారు. సర్కిల్ వ్యాప్తంగా బకాయిలు వసూళ్లతో ఆయా సంస్థలకు పెద్ద మొత్తంలో ఆర్థిక మినహాయింపులు లభించనున్నాయి. సర్కిల్లో 10 డాకెట్లుండగా.. వాటి వారిగా అధికారులకు బకాయి వసూళ్ల లక్ష్యాలను నిర్ధారించారు.
స్వయంగా ఫోన్లు చేయిస్తున్నాం..
ఆస్తిపన్ను బకాయిలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గరిష్టంగా బకాయిలున్న వారి జాబితా సేకరించి స్వయంగా ఫోన్ చేసి బకాయిల వివరాలను.. ఓటీఎస్ వినియోగించుకోవటం ద్వారా వారిపై తగ్గే ఆర్థిక భారం వివరాలను తెలుపుతున్నాం. కొందరు తక్షణమే ముందుకు వస్తూ చెల్లింపులు చేస్తున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను మరింత పకడ్బందీగా చేపట్టి పన్ను బకాయిలను వసూలు చేయాలి. బకాయిదారులు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. చెల్లింపులను సిబ్బంది వద్ద, ఆన్లైన్, మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సేవా కేంద్రాలలోనూ చేయవచ్చు.
– నందగిరి సుధాంశ్, డీసీ చందానగర్ సర్కిల్