ఎల్బీనగర్, జూలై 21 : నాపై నమ్మకం ఉంచండి.. బాక్స్ డ్రైన్ పనులను పూర్తి చేయనివ్వండని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కోరారు. గురువారం లింగోజిగూడ డివిజన్ అల్తాఫ్నగర్లో బాక్స్ డ్రైన్ పనుల విషయంలో స్థానికులకు ఉన్న సందేహాలను ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయానికి పిలిపించి తీర్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. బాక్స్ డ్రైన్ పనుల విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన పనిలేదన్నారు. ఎవరికీ ఎలాంటి నష్టం కలుగకుండా ప్రణాళికాబద్ధంగానే బాక్స్డ్రైన్ పనులకు సిద్ధం అయ్యారని అన్నారు. బాక్స్ డ్రైన్ పనులు పూర్తయితే భవిష్యత్తులో ఎలాంటి ముంపు సమస్యలు ఉండబోవన్నారు. కాలనీవాసులు సందేహాలను వీడి బాక్స్ డ్రైన్ పనులు చేపడుతున్న అధికారులకు సహకరించాలని కోరారు. స్థానికులు వెలిబుచ్చిన అభ్యర్థలను తాను పరిగణనలోకి తీసుకుంటున్నానని, మరోసారి అధికారులతో కలిసి కాలనీని సందర్శించి స్థానికులకు నష్టం కలుగకుండా పనులు సాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పర్నె వరప్రసాద్‌రెడ్డి, రాకేశ్ఠాకూర్, వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.