పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. మేడ్చల్ జాతీయ రహదారిపై మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బైఠాయించారు. మోదీ హఠావో.. భారత్ బచావో’ అని నినాదాలు చేశారు. టీఆర్ఎస్ హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు మాగంటి గోపినాథ్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ): పేదలంటే గిట్టని ప్రధాని మోదీ వారి జీవితాలను అతలాకుతలం చేసేందుకే నిత్యావసరాలపై భారీగా పన్నులు పెంచుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాలపై విధించిన పన్నులకు వ్యతిరేకంగా మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో చేపట్టారు. ఇందులో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ నిత్యావసరాలైన పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, గోధుమలు, చక్కర, కూరగాయలపై జీఎస్టీని విధించడం అన్యాయమన్నారు. సామాన్యుడిపై ఇంత భారం మోపితే ఎలా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో ప్రతిఒక్కరూ విసిగిపోతున్నారని.. ఇంతటి నిరంకుశ ప్రధానిని చూడలేదని విమర్శించారు. ప్రధాని మోదీ దేశాన్ని పాలించే అర్హత కోల్పోయారని దుయ్యబట్టారు. ఇకనైనా తీరు మార్చుకోక పోతే దేశ ప్రజలే బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. నిత్యావసరాలపై పన్నులు ఎత్తేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.
అరాచక పాలనకు చరమగీతం పాడాలి..
అరాచక పాలనను కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ, పన్నీర్, బెల్లం, కూరగాయలపై జీఎస్టీ విధించడం దారుణమని విమర్శించారు. పేదలకు న్యాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పన్నుల పేర భారం మోపడం అన్యాయమన్నారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో ప్రతిఒక్కరూ అవస్థలు పడుతున్నారని.. ఆయన గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ రాస్తారోకోలో జడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, మేయర్లు జక్క వెంకట్‌రెడ్డి, మేకల కావ్య, మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికానర్సింహారెడ్డి, నాయకులు ముద్దల శ్రీనివాస్‌రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, మండల పార్టీ, మున్సిపాలిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– శంభీపూర్ రాజు, టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు
మోదీ హటావో.. దేశ్‌కో బచావో..
మేడ్చల్‌లోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో మోదీ హటావో.. దేశ్‌కో బచావో నినాదాలు మిన్నంటాయి. జీఎస్టీ పోటును వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన నాయకులు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అసమర్థ ప్రధాని గద్దె దిగాలని నినదించారు.
ఔరంగజేబును మరిపిస్తున్న మోదీ
కేంద్ర ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. ప్రజల బాధలు ఏ మాత్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా పన్నులు వేస్తున్నారు. చంటిపిల్లలు తాగే పాలమీద కూడా జీఎస్టీ విధించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే. గతంలో ఔరంగజేబు పెరిగిన గడ్డాలపై పన్ను వేశారని విన్నాం. మళ్లీ ఆ రోజులు రోబోతున్నాయి. ప్రతి వస్తువు మీద పన్ను వేసే మోదీకి రోజులు దగ్గర పడ్డాయి. పెంచిన పన్నులు తగ్గించకపోతే ప్రజల ఆగ్రహం చవిచూడటం ఖాయం.
– దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే
ప్రజల రక్తం పీలుస్తున్న కేంద్రం..
కరోనాతో పాటు అనేక కష్టాల్లో ఉన్న దేశ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నది. నిత్యావసరాలపై పన్నులు పెంచడం సిగ్గుచేటు. కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయిన మోడీ పేదవాడి రక్తాన్ని పీలుస్తున్నాడు. పేదలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్రం మాత్రం వారిని దోచుకుంటున్నది. పన్నులపై బీజేపీ నేతలను నిలదీయాలి.
–మాగంటి గోపీనాథ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
ఏ వస్తువు కొనేటట్టు లేదు..
ఏ వస్తువు కొందామన్నా పన్ను పోటు విధిస్తున్నారు. తినే వస్తువులపై సైతం జీఎస్టీని విధించడం దారుణం. జీఎస్టీతో పేదలు మరింత దిగజారిపోతుండగా.. పెద్దలు మాత్రం అందలం ఎక్కుతున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమపై జీఎస్టీ పేరుతో పన్నులు వేయడం దారుణం. పశువుల దాణాపై ఇప్పటికే జీఎస్టీ విధిస్తున్నారు. మోదీ పాలన త్వరగా పోవాలని కోరుకుంటున్నా..
– అబేసి ఆనంద్, గొల్లూరు గ్రామరైతు
మోదీ రాజీనామా చేయాలి
జీఎస్టీ పేరుతో భారీగా పన్నులు విధిస్తున్న ప్రధాని మోడీ వెంటనే గద్దె దిగాలి. మోదీ అండ్ కో చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తెలంగాణ యువత తిప్పికొట్టాలి. 8 ఏండ్ల కాలంలో దేశాన్ని అప్పుల పాలు చేశారు. మౌలిక వసతుల కల్పనను విస్మరిస్తూ పన్నుల భారాన్ని మోపుతున్నారు. ఉప్పు నుంచి పప్పు, పాలప్యాకెట్ నుంచి కూరగాయల వరకు కాదేదీ పన్నుకు అనర్హం అంటూ కొత్త అర్థం తీసుకొచ్చారు. పన్నుల భారం మోపుతూ పేదలను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్న ఘనత మోడీదే. ప్రధాని తన స్నేహితులను ప్రపంచంలోనే ధనవంతులుగా మార్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. మోదీ తప్పులు ఒప్పుకొని జాతికి క్షమాపణ చెప్పాలి.
– తుంగబాలు, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు