వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 20 : రాజేంద్రనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ సాయిల్డ్ హెల్త్ మేనేజ్మెంట్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కాంప్లెక్స్‌ను బుధవారం ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్‌రావు ప్రారంభించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద రాష్ట్రీయ కృషి వికాస్ యోజన్ నిధుల సహాయంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌కు ప్రముఖ ప్రపంచ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎంఎస్ స్వామినాథన్ అనెక్సీ అని నామకరణం చేసి ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఈ విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధనలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెద్దఎత్తున కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సదుపాయాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని రైతాంగం, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు సూచించారు. శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్‌కు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.