సుల్తాన్‌బజార్, జూలై 20: దేవాదాయశాఖ పరిధిలో లేని ఆలయాలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గోషామహల్ నియోజకవర్గపరిధిలోని 72 ఆలయాలకు రూ.22 లక్షలు, మలక్‌పేట నియోజకవర్గంలోని 68 దేవాలయాలకు రూ.16 లక్షల విలువైన చెక్కులను బుధవారం బొగ్గులకుంట దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్అలీతో కలిసి తలసాని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనేది సర్కారు సంకల్పమని, బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని తెలిపారు.
గ్రేటర్‌వ్యాప్తంగా బోనాలను ఘనంగా నిర్వహించేలా 3500 దేవాలయాలకు రూ.15 కోట్లను విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గత ప్రభుత్వాలు బోనాల తర్వాత ఆర్థికసాయం చెక్కులిచ్చేవారని, ఇప్పుడు ఉత్సవాలకు ముందే అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ప్రభాకర్‌రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్,జాయింట్ కమిషనర్ రామకృష్ణ,అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్‌యాదవ్, పలువురు కార్పొరేటర్లు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
బోనాల ఏర్పాట్లపై బీజేపీ కార్పొరేటర్ ప్రశంస: గతంలో ఎప్పుడు లేనివిధంగా బోనాలకు ముందే ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడం విశేషమని బీజేపీ బేగంబజార్ కార్పొరేటర్ శంకర్‌యాదవ్ ప్రశంసించారు. ఉత్సవాల కోసం ఇంతకుముందు ప్రజల నుంచి విరాళాలు సేకరించేవారమని, ఇపుడు అన్ని పండుగలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వమే ఏర్పాట్లు చేపట్టడం అభినందనీయమన్నారు.
23న లాల్‌దర్వాజ ఆలయంలో ‘మన సారె..మనసారా’
హిమాయత్‌నగర్,జూలై 20: పాతనగరంలోని లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో ఈనెల 23న ‘మన సారె- మన సారా’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శ్రీశైవక్షేత్ర వనితాశక్తి అధ్యక్షురాలు యాద మంజుల, ప్రధానకార్యదర్శి సౌజన్య తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాలను బుధవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో వారు ఆవిష్కరించారు.