సిటీబ్యూరో, జూలై 20 (నమస్తేతెలంగాణ)/ఎల్బీనగర్ : వరద నివారణ, ముంపు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో ఇప్పటివరకు జరిగిన పనుల ద్వారా వందలాది కాలనీలలో వరద ముంపు సమస్య తీరిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఎల్బీనగర్ జోన్లో పలుచోట్ల నాలా అభివృద్ధి పనులను మేయర్ బుధవారం పరిశీలించారు. తొలుత సరూర్‌నగర్ చెరువు నుంచి కోదండరామ్‌నగర్ మీదుగా చైతన్యపురి వరకు రూ.21.47 కోట్లతో చేపట్టిన పనులను పర్యవేక్షించారు. అనంతరం సరూర్‌నగర్ చెరువు వద్ద తూములను పరిశీలించారు. తర్వాత బండ్లగూడ చెరువు నుంచి నాగోలు వరకు చేపట్టిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన 36 పనులు వేగవంతమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలో చేపట్టిన పనులు త్వరలో పూర్తవుతాయన్నారు. వర్షాలు పడినా పనులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారని, ప్రమాదం సంభవించకుండా హెచ్చరిక బోర్డులు పెట్టినట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 54.11 కి.మీ.మేర 37 పనులను సుమారు రూ.1000 కోట్లతో చేపట్టామని, వరద ముంపు ఎకువ ఉన్న ఎల్బీనగర్లో వరద సమస్య శాశ్వత నివారణకు రూ.113.59 కోట్లతో పనులు చేపడుతున్నామన్నారు. ఈ పనుల్లో కొన్ని చివరిదశకు రాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మేయర్ వెంట ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఈలు అశోక్‌రెడ్డి,భాసర్‌రెడ్డి, ఈఈలు కృష్ణయ్య, కోటేశ్వర్రావు, డీఈ వెంకటకృష్ణ, ఇతర అధికారులు ఉన్నారు.