జూబ్లీహిల్స్, జూలై 20: చిన్నపిల్లలు తాగే పాలపై జీఎస్టీ విధించడం సిగ్గుచేటని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బుధవారం రహ్మత్‌నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్‌లోని ఎన్ఎస్బీనగర్ కూడలిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతూ ప్రధాని దేవుడంటూ ప్రగల్భాలు పలికే బండి సంజయ్ ఇప్పుడు ఎటు పోయిండంటూ ప్రశ్నించారు. దేవుడితో సమానమైన చంటి పిల్లలు తాగే పాలను కూడా వదిలిపెట్టకుండా జీఎస్టీ విధించడమంటే దయ్యాలు చేసే పనులంటూ విమర్శించారు. ప్రజల సుఖాలను గాలికొదిలేసి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఆమోదయోగ్యమైన పాలన అందించాలని హితవు పలికారు. నిరసనలో భాగంగా పాడి పశువులపై ప్లకార్డులు అంటించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య విజయ్, సంగీతా యాదవ్, మన్నె కవితా రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.