మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట్ వే ఐటీ పార్క్ నిర్మాణానికి త్వరలోనే టెండర్ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారం రోజుల్లో టెండర్లను ఆహ్వానించి ప్రక్రియ పూర్తయిన వెంటనే 36 నెలలో ఐటీ పార్క్ భవన నిర్మాణ పనులు పూర్తి చేసేలా టీఎస్ఐఐసీ ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ నగరం చుట్టూ నాలుగు వైపులా ఐటీ పార్క్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాన ఐటీ పరిశ్రమ విస్తరణకు 6 లక్షల పైచిలుకు ఎస్ఎఫ్టీ విస్తీర్ణంతో గేట్‌వే ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గేట్‌వే ఐటీ పార్క్‌కు ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 250 కోట్ల నిధులను మంజూరు చేసింది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో పనులను ప్రారంభించేలా టీఎస్ఐఐసీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
గేట్‌వే ఐటీ పార్క్‌లో కార్యాలయాల ఏర్పాటుకు అనేక కంపెనీల యజమానులు ముందుకు వస్తున్న నేపథ్యంలో 6 లక్షల పైచిలుకు ఎస్ఎఫ్టీని 22 లక్షల ఎస్‌ఎఫ్‌టీగా మార్చే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గేట్ వే ఐటీ పార్క్‌లో ఇప్పటి వరకు వందకుపైగా కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. యూరప్, యూకే, యూఎస్ఏ దేశాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాలకు చెందిన కంపెనీల ఏర్పాటుకు అనేక మంది యజమానులు ముందుకు వస్తున్నట్లు కొంపల్లి ఐటీ ఆంత్రప్రెన్యూర్ అసోసియేషన్ ప్రతినిధుల అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్ తెలిపారు.