మేడ్చల్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : పరిశ్రమలు అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతను ఇస్తుంది. వివిధ పరిశ్రమల నుంచి వ్యాపారులు తీసుకున్న ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రీజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక) సత్ఫలితాలు ఇస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రీజినల్ పరిధిలోని సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమలకు వ్యాపారులు రూ.110 కోట్ల బకాయిలు చెల్లించేలా పరిశ్రమల రీజినల్ చైర్మన్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిశ్రమల మేనేజర్ రవీందర్ చేసిన అవార్డు(నోటీసుల) జారీతో రూ. 80 కోట్లు బకాయిల చెల్లింపులు పరిశ్రమలకు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 2018 నుంచి వివిధ పరిశ్రమలకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు జరగడంతో పరిశ్రమలు మరింత అభివృద్ధి చెంది ఉత్పత్తులు పెంచే అవకాశం ఉంది.
పరిశ్రమల నుంచి ఉత్పత్తులు తీసుకుని వాటికి సంబంధించిన బకాయిల చెల్లింపులు చేయనట్లయితే పరిశ్రమల శాఖకు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా దరఖాస్తులు చేసినా రీజినల్ కౌన్సిల్(పరిష్కార వేదిక)లో బకాయిలు చెల్లించాల్సిన వ్యాపారుస్తుల సమావేశమై చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎంఎస్ఎంఈడీ 2006 యాక్ట్ ప్రకారం పరిశ్రమల నుంచి వ్యాపారులు తీసుకున్న ఉత్పత్తులకు సంబంధించి ఇరువురి పత్రాల ఆధారంగా నిర్ణయాన్ని రీజినల్ కౌన్సిల్(పరిష్కార వేదిక)లో తీసుకుంటారు. రీజినల్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం బకాయిలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. లేనట్లయితే ఎంఎస్ఈడీ 2006 యాక్ట్ ప్రకారం చర్యలు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. పరిశ్రమలకు చెల్లించాల్సిన బకాయిలలో పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపినందున మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రీజినల్ కౌన్సిల్‌కు ఎంఎస్ఈఏసీ అవార్డును అందజేసింది.