ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20 : భవిష్యత్‌లో వచ్చే ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని సీఎస్ఐఆర్ – సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె. నందుకూరి అన్నారు. బయాలజీ, జెనిటిక్స్ రంగాల్లో వచ్చిన అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలే ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగంలో బుధవారం నుంచి మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ‘ఇంటిగ్రేటివ్ బయాలజీ అండ్ ఐప్లెడ్ జెనిటిక్స్’ (ఐసీఐబీఏజీ – 2022)అనే అంశంపై రెండవ అంతర్జాతీయ సదస్సు ఇది.ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా డాక్టర్ వినయ్ కె నందుకూరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో దేశంలో రెండు వందల కోట్ల వ్యాక్సిన్లను ప్రజలకు పంపిణీ చేసిందని, ఇందుకు గర్వంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు ప్లేగు, బబ్నిక్ ప్లేగు, స్మాల్ పాక్స్, స్పానిష్ ఫ్లూ, హెచ్ఐవీ, కరోనా ఇలా ఆరు మహమ్మారులు ప్రపంచ చరిత్రలో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేశాయని అన్నారు. సైన్స్‌కు సంబంధించిన అన్ని విభాగాలు కలిసి పనిచేస్తే మరింత ఉన్నతంగా రాణించవచ్చని సూచించారు. సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్ఐఎన్, సీఎఫ్ఆర్డీ ఇలా ప్రఖ్యాత పరిశోధక సంస్థలన్నీ సమీకృత పరిశోధనల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.
సమీకృత విద్య, పరిశోధనల దిశగా జాతీయ విద్యావిధానం దృష్టి సారించిందని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. సదస్సు కన్వీనర్, ఓయూ సీఎఫ్ఆర్డీ డైరెక్టర్, జెనిటిక్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ స్మితా కె. పవార్ మాట్లాడుతూ ఎన్నో పరిశోధనలు, ఆవిష్కరణలకు సమగ్ర శాస్ర్తాల సమ్మేళనంతో తొలి అడుగు పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఎ. బాలకిషన్, డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.