సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ): ‘ఫెయిల్ ప్రూఫ్ నెట్ వర్క్’ సిస్టమ్‌తో సైబరాబాద్ పరిధిలో మత్తుకు పోలీసులు చెక్ పెడుతున్నారు. యువకులు, మత్తు బాబుల వద్దకు చేరకుండా కంచె వేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోకుండా మత్తు పదార్థాల వాసన తగలకుండా ఎక్కడికక్కడే నెట్‌వర్క్‌ను పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో పోలీసు అధికారులు పక్కా సమాచారంతో ఫెయిల్ ఫ్రూఫ్ నెట్వర్క్ (పక్కా సమాచారం, పక్కా ఆధారాలతో విఫలం కాకుండా నేరగాళ్లను పట్టుకోవడానికి టీమ్)ను ఏర్పాటు చేసుకుని మత్తు పదార్థాల స్మగ్లర్లకు అడ్డుకట్టవేస్తున్నారు.
శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో గంజాయి, డ్రగ్స్ దందాపై పంజా విసిరి దాదాపు 1982 కిలోల గంజాయి పట్టుకున్నది. వీటి విలువ మార్కెట్లో దాదాపు 5.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ కేసుల్లో 61 మంది నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ డీసీపీ తన జోన్ పరిధిలోని లా అండ్ ఆర్డర్, ఎస్ఓటీ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. దీంతో నేరాలకు చెక్ పెడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలకు వెళ్లాల్సిన మత్తు పదార్ధాలు కాలిబూడిదయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో శంషాబాద్ డీసీపీ జోన్ పరిధిలో పట్టుబడిన గంజాయి కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్ని ఎత్తులు వేసినా..
మరికొన్ని కేసులతో కలిపి మొత్తం 1982 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా సైబరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ ఉండటం, అదే విధంగా చెక్ పోస్టులు తగలకుండా నిందితులు ఏపీ నుంచి ఓఆర్ఆర్ మార్గానికి చేరుకుంటున్నారు. ఇక్కడ రహదారులు నేరుగా మహారాష్ట్ర, కర్ణాటకకు చేరుకోవడానికి దగ్గర ఉండటంతో గంజాయి స్మగ్లర్లు ఈ రూటును ఎంచుకుంటున్నారు. నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా ప్రతిసారి ఓ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. చేపలు, కూరగాయలు, పరుపులు, గ్యాస్ సిలిండర్లు, విత్తనాల బ్యాగులు వంటి లోడ్ వాహనాల్లో గంజాయి తరలిస్తున్నారు. కొన్ని వాహనాల్లో ప్రత్యేకంగా క్యాబిన్ ఏర్పాటు చేసుకొని మత్తు పదార్థాలు తరలిస్తున్నారు. నేరగాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా.. పోలీసులు మాత్రం పక్కా సమాచారం, ఆధారాలతో మత్తు దందాకు అడ్డుకట్టవేయడంలో సక్సెస్ అవుతున్నారు.