సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): క్యాన్సర్ బాధితులకు ఓ మెడికో అండగా నిలిచింది. నేను సైతం అంటూ.. తన కేశాలను దానం చేసింది. (ఖమ్మం) కొత్తగూడెం పట్టణానికి చెందిన దేవనపల్లి అక్షయ రమేశ్ సిద్ధిపేటలోని సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నది. తల వెంట్రుకలే కాదు.. తన మెడిసిన్ విద్య పూర్తిచేసిన తర్వాత పేదలకు వృత్తిపరమైన సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొంది. అక్షయ దాతృత్వం కుటుంబ సభ్యుల ద్వారానే తన కేశాలు దానం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.
ఒక వెంట్రుక రాలిపోయినా మహిళలు ఎంతో మనోవేదనకు గురవుతారు. అలాంటిది క్యాన్సర్ బాధితులకు ఇచ్చే చికిత్సలో తల వెంట్రుకలు మొత్తం ఊడిపోతే వారి బాధ వర్ణనాతీతం. అలాంటి వారి కోసం నేనున్నానంటూ అక్షయ ముందుకొచ్చి దాతృత్వాన్ని చాటుకున్నది. క్యాన్సర్ పేషెంట్ల కోసం వెంట్రుకలు సేకరించి, విగ్గులు తయారు చేసి ఉచితంగా అందజేసే చారిటబుల్ సంస్థకు రెండు రోజుల కిందట నగరంలో అందజేశారు.
తన వంతుగా విగ్గుల తయారీకి సంస్థకు తల వెంట్రుకలు డొనేట్ చేయడం ఎంతో గొప్పగా ఫీలయ్యానని అక్షయ పేర్కొన్నారు. కురులను విగ్గులుగా మార్చి కీమో థెరపీ చికిత్స ద్వారా వెంట్రుకలు కోల్పోయిన వారికి ఉచితంగా అందజేయాలని అక్షయ విజ్ఞప్తి చేసినట్లు తెలిపింది. ఈ సందర్భంగా మెడిసిన్ అభ్యసిస్తున్న తరుణంలోనే రోగుల కోసం తన జడను దానమివ్వడంతో ఆమెను సహచర మెడికోలతో పాటు పలువురు అభినందనల్లో ముంచెత్తారు. ‘హ్యాట్సాఫ్ టు మై డియర్ లవ్లీ డాటర్ అక్షయ’ అంటూ.. తన మూడో కూతురును తండ్రి రమేశ్ అభినందించారు.
క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూరాలి: రేవతి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లికి చెందిన రేవతి జన్నవరపు తన జడను క్యాన్సర్ రోగుల కోసం దానం చేసింది. ఈ నెల 13న హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఫౌండేషన్‌కు తన కేశాలను అప్పగించారు. ప్రముఖ సినీనటి రేణు దేశాయ్ స్ఫూర్తి అని రేవతి జన్నవరపు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ఎదో రకంగా స్పందిస్తే, వారికి ఎంతో మేలు జరుగుతందని ఆమె పేర్కొన్నారు. తన హెయిర్ డొనేషన్‌కు తన భర్త ప్రోత్సాహం ఎంతో ఉందని తెలిపారు. తాను తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పటి నుంచి కేశాలు దానం చేయాలనుకుంటున్నా కాని, అప్పుడు చేయలేకపోయానని అన్నారు. ప్రస్తుతం, సమయం కుదరడంతో డొనేషన్ చేశానని పేర్కొన్నారు. తన జడను బాధితుల సాంత్వన నిమిత్తం అందజేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు రేవతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.