పీర్జాదిగూడ, జూలై 19: విద్యా రంగంలో యావత్ భారతానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శవంతమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు కార్పొరేట్ వసతులు కల్పిస్తూ సీఎం కేసీఆర్ విద్యా రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రభుత్వ పాఠశాలల్లో ఏవీ కన్స్ట్రక్షన్ సౌజన్యంతో విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి ఉచితంగా మంగళవారం నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సుమారు రూ.7,289 కోట్లతో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ – మన బడి’ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దినదన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల శ్రద్ధ చూపిస్తున్న పీర్జాదిగూడ కార్పొరేషన్ పాలక వర్గాన్ని అభినందించారు.
ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగినదని పేర్కొన్నారు. మేయర్ మాట్లాడుతూ విద్యార్థులకు నోట్ బుక్స్ అందించడం అనందంగా ఉన్నదన్నారు. అనంతరం, మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10/10 జీపీఏ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం అందించారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిది పాఠశాలల్లో సుమారు 2000 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో విజయ కుమారి, కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు హరిశంకర్‌రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్ నాయక్, బచ్చరాజు, నాయకులు అంజిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రవీందర్, సతీష్ గౌడ్, ఈశ్వర్ రెడ్డి, అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.