సుల్తాన్ బజార్, జూలై 19: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత రంగ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం గన్ఫౌండ్రిలోని పర్వానా హాల్లో ఏపీ అండ్ టీఎస్ బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏఐబీఈఏ) అధ్యక్షుడు టి.రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో 53వ బ్యాంకుల జాతీయీకరణ దినోత్సవం సందర్భంగా ‘బ్యాంకుల జాతీయీకరణ – ఆర్ధిక అభివృద్ధి’ అనే అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహించింది.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజా సంక్షేమం ఉండదని పేర్కొన్నారు. ఈ ప్రైవేటీకరణను టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. కొంతమంది వ్యక్తుల చేతుల్లో సంపద కేంద్రీకరణను నిరోధించేందుకు, దేశ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధికి నిధులను సమీకరించడం కోసం, పరిశ్రమలు, వ్యవసాయం, అనుబంధ కార్యాకలాపాలపై ఆధారపడి వ్యవసాయ సంఘాలకు నిధులు సమకూర్చడం కోసం బ్యాంకుల జాతీయీకరణ జరిగిందన్నారు.
దీంతో నాడు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యాప్తి దేశ సమతుల్య ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసిందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా విఫలమయ్యాయని పేర్కొన్నారు. 90 శాతం ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడ్డాయని, ప్రజలు తమ కోట్ల రూపాయల డిపాజిట్లను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే సామాన్యులు, పేదలకు సేవందిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాతీయ బ్యాంకుల కోట్లాది రుణాల ఎగవేత దారులు ధనిక పారిశ్రామిక వేత్తలేనని, వారిపై ఎటాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరించడం ఏమిటి? అని ఆయన ప్రశ్పించారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన కార్పొరేట్ మిత్రులు లూటీ చేసుకోవడానికి బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నాడని మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భయంకరమైన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నదని ఆయన దుయ్యబట్టారు. ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు మాట్లాడుతూ దేశ ఆర్ధికాభివృద్ధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులే కీలకం అని, కార్పొరేట్లు, ధనిక పారిశ్రామికవేత్తల కోసం వాటిని ప్రైవేటీకరిస్తే సహించేది లేదని అన్నారు. జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, సుదీర్ఘ సమ్మెలు, నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్న పోరాటాలకు మద్దతునిస్తూ ఏఐటీయూసీ అండగా ఉంటున్నదన్నారు. ఈ సదస్సులో ఏఐబీఓసీ నాయకులు ఫణి కుమార్, ఏఐబీఈఏ కేంద్ర కమిటీ సభ్యులు పద్మ, సమద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.