ఖైరతాబాద్, జూలై 19: తెంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాల సర్వే నిర్వహించి, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇటుక రాజుతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి పదేండ్లకు భారత ప్రభుత్వం చేపట్టే కుటుంబ సర్వే చివరి సారిగా 2011లో నిర్వహించారని పేర్కొన్నారు. అయితే, అప్పటి లెక్కల్లో ఏడు శాతంగా గుర్తించారని, ప్రస్తుతం జనాభా పెరిగిన నేపథ్యంలో 12 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.
కేంద్రం వర్గీకరణ బిల్లు తీసుకువచ్చేందుకు రాష్ర్టాలకు అధికారం ఇస్తే 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌తో ఆగస్టు 8, 9వ తేదీల్లో చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని, జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, భారీ ర్యాలీ చేపడుతామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు గడ్డ యాదయ్య, మాదిగ మహాసభ అధ్యక్షులు మల్లికార్జున్, మహా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ముత్యపాగ నర్సింగరావు, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు బాబురావు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి జాతీయ నాయకులు లాజర్, తెలంగాణ దళిత దండు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగులయ్య, మాదిగ జేఏసీ నాయకులు జెస్సీ, రమ్య, సరస్వతి పాల్గొన్నారు.