బేగంపేట, జూలై 19 : తెలంగాణ ఆవిర్భావం తర్వా తే బోనాల పండుగకు మరింత ఖ్యాతి పెరిగిందని, స్వరాష్ట్రంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, మహంకాళి బోనాలు, రంగం, అంబారిపై అమ్మవారి ఊరేగింపునకు వేలాదిమంది వచ్చారని తెలిపారు.
దేవాదాయశాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్, హెల్త్, జలమండలి, అర్చకులు, పండితులు ప్రతిఒక్కరి కృషితోనే బోనాల జాతర ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. భక్తులకు సేవలు అందించిన దక్కన్ మానవ సేవా సమితి, ఆర్యసమాజ్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థల సభ్యులు, ఇతర వలంటీర్లను అభినందించారు. గతంలో భక్తులు దర్శనం కోసం చాలాసేపు ఉండాల్సి వచ్చేదని, ఈ ఏడాది నుంచి బోనాలు తెచ్చే వారికి అదనపు క్యూలైన్ ఏర్పాటు చేయడం వల్ల స్వల్ప సమయంలోనే దర్శనం చేసుకున్నారని వివరించారు. బోనాల ఉత్సవాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈనెల 31న సన్మానించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐజీ పూజలు: రిటైర్డ్ ఐజీ డాక్టర్ మురళీకృష్ణ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఈవో ఆయన్ను సన్మానించారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో బోనాలు
సిటీబ్యూరో,జూలై 19 (నమస్తేతెలంగాణ): ఆషాఢ బోనాల ఉత్సవాలను జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, డిప్యూటీ మేయర్ శ్రీలత, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.