కీసర, జూలై 19 : ఇండ్ల నుంచి వెలువడే చెత్తను పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్‌కు అందజేయాలని డీఎల్పీఓ స్మిత ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో చెత్త డంపింగ్ జరుగుతున్న పనులను మంగళవారం సర్పంచ్ పెంటయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎల్పీఓ మాట్లాడుతూ రోడ్ల పై చెత్త వేయకుండా పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
గ్రామాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానిక పంచాయతీ కార్యదర్శి, సర్పంచులపై ఉందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా లేకపోతే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అమ్రీన్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
చెత్త రోడ్ల పై పారవేస్తే జరిమానా..
మేడ్చల్ రూరల్, జూలై 19 : చెత్తను రోడ్లపై పారవేస్తే జరిమానా విధిస్తామని మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహా రెడ్డి హెచ్చరించారు. 11వ వార్డులో వార్డు కౌన్సిలర్ పానుగంటి సుహాసినితో కలిసి ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాల సీజన్లో రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను స్వచ్ఛ వాహనాలకు అందజేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా శిథిలావస్థకు చేరిన ఇండ్లను ఖాళీ చేయాలని నోటీసులు అందజేశారు. 23వ వార్డు కౌన్సిలర్ మహేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాంచందర్, వర్క్ఇన్స్పెక్టర్ వినయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.