సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లోని కాలనీల్లో వంద శాతం గ్రీనరీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా 4846 కాలనీలను గుర్తించిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు 8వ విడత హరితహారంలో కాలనీ గ్రీనరీకి పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగా ప్లాంటేషన్ పనులను విస్తృతంగా చేపట్టేందుకు రంగంలోకి దిగారు. 8వ విడత హరితహారం కార్యక్రమంలో కోటి 25 లక్షల మొక్కలు లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయగా.. ఇందులో 3వేల కాలనీలను వంద శాతం గ్రీనరీగా మలిచేందుకుగాను టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులను వచ్చే వారంలో ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో కాలనీని యూనిట్‌గా తీసుకొని కాలనీ ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు పచ్చదనంతో కళకళలాడేలా పండ్లు, పూల మొక్కలకు నాటనున్నారు. డిసెంబరు నెలాఖరు వరకు ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇనిస్టిట్యూషన్స్, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. వీలైన చోట వాకింగ్ ట్రాక్‌లు, బెంచీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.