సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): ‘హరిహరి అంటూ హరిదాసుల తలుస్తూ… శివ అంటే శివునికి పేరు.. నవ అంటే బ్రహ్మకు పేరు’ అంటూ.. ముక్కోటి దేవతలను తలుస్తూ.. స్వర్ణలత రంగం ఎక్కారు. ఆలయ ప్రాంగణంలోని మాతంగేశ్వరి అమ్మవారి వద్ద పచ్చికుండపై స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. మీ సంతోషం కోసమే మొక్కులా.. మరి నా సంతోషమేంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హృదయాలపై చేయి వేసి చెప్పండి, నా ఆలయంలో పూజలు జరుపుతున్నారా.. నా రూపాలను ఎన్నిసార్లు మారుస్తారు? ప్రజలందరూ కనులారా వీక్షించే విధంగా.. గర్భాలయంలో శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించి తన స్థిరమైన స్వరూపాన్ని ఏర్పర్చాలని కోరింది. ఎన్ని పొరపాట్లు చేసినా.. నా బిడ్డలే కదాని సరిపెట్టుకొని, కడుపులపెట్టుకొని మెదులుతున్నట్లు తెలిపింది. ఆపదలు రాకుండా, కంటతడి పెట్టకుండా ప్రజలను కాపాడే బాధ్యత నాదని అమ్మవారు భవిష్యవాణిలో వినిపించారు. కాగా వచ్చే ఏడాది వరకు పట్టు బట్టలు, బంగారు వస్ర్తాలతో స్థిరమైన రూపాన్ని ఏర్పర్చి ఘనంగా పూజలు నిర్వహిస్తామని ఆలయ పూజారులు అమ్మవారికి విన్నవించారు. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించాలి తల్లీ అంటూ వేడుకున్నారు. దీంతో అమ్మవారు శాంతించింది. దీంతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో కీలక ఘట్టం రంగం కార్యక్రమం ముగిసింది.