బేగంపేట్ /మారేడ్‌పల్లి, జూలై 18: లష్కర్లో బోనాల ఉత్సవాలు రెండు రోజుల పాటు కన్నుల పండువగా జరిగాయి. సోమవారం ఉదయం ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో మొదటగా అమ్మవారికి సాక సమర్పణ ప్రత్యేక పూజల అనంతరం భవిష్యవాణి, బలిగంప, పోతరాజుల విన్యాసాలు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు నేత్ర పర్వంగా కొనసాగింది. అంబారీ ఊరేగింపులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళి పోలీస్‌స్టేషన్ వద్ద అంబారీకి పోలీస్ ఉన్నతాధికారులు అడిషినల్ సీపీ చౌహాన్, డీసీపీ చందనాదీప్తిలు పూజలు చేశారు.అంబారీపై అమ్మవారిని ఊరేగింపుగా, ఘటాన్ని మెట్టుగూడలో దేవాలయానికి తీసుకువెళ్లారు. ఊరేగింపులో కళాకారుల వేషధారణలు, కళారూపాలు, పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఉజ్జయినీ మహంకాళిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అమనుమతించారు. సికింద్రాబాద్ ప్రధాన రహదారులతో పాటు పురవీధుల్లో అమ్మవారి నామస్మరణలు, భక్తులు విశేష పూజలు అలరించాయి. వివిధ శాఖల అధ్వర్యంలో భక్తులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్టు ఈవో మనోహార్‌రెడ్డి వెల్లడించారు. సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిచేలా వివిధ ప్రాంతాలలో కళారుపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు
ఉజ్జయినీ మహంకాళి జాతర, భవిష్యవాణిని భక్తులు వీక్షించేందుకు దేవాలయం పరిసరాల్లో రెండు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి భవిష్యవాణి విన్నారు.
అమ్మవారికి బలిగంప
అమ్మవారికి మరో ఘట్టంలో బలిగంపతో పాటు గావుపట్టడం, పోతరాజుల విన్యాసాలు చేశారు. ఆలయం ఎదుట ఆరుగురు పోతరాజులు భక్తులకు కనువిందు కలిగేలా వివిధ రకాల విన్యాసాలతో ఆకట్టుకున్నారు. ఆలయంలో ఆమ్మవారికి గుమ్మడికాయ బలిని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

ఆకట్టుకున్న ఫలహారపు బండ్లు,తొట్టెల ఊరేగింపు
అమ్మవారి జాతరలో కళాకారుల విచిత్ర వేషధారణలతో తొట్టెల, ఫలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఫలహారం బండి ఊరేగింపులో హోం మంత్రి మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజలు పాటు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ప్రసాదాలు పంపిణీ చేశారు.
జీహెచ్ఎంసీ సేవలు భేష్
జాతరలో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు సేవలు అందించారు. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు సికింద్రాబాద్ ప్రధాన అంతర్గతదారులు చెత్తను ఎప్పటికప్పుడు తొలగించారు. అలాగే దేవాలయం ప్రాంగణంలో భక్తుల కోసం దక్కన్ మానవ సేవా సమితి, మక్తాల ఫౌండేషన్ ప్రతినిధులు ఇతర సేవా సంస్థలు భక్తులకు తగిన సేవలు అందించారు. ఉత్సవాల్లో ఉత్తర మండలం డీసీసీ చందనాదీప్తి, మహంకాళి ఏసీపీ రమేశ్‌లు ఆదేశాల మేరకు పోలీసులు తగిన బందోబస్త్ నిర్వహించారు. అలాగే జలమండలి అధికారులు భక్తులకు క్యూలైన్లో తాగునీటి ప్యాకెట్లను అందించారు.జాతరలో సేవలు అందించిన అందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
