సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): వీడియో కాల్ రికార్డింగ్‌లో ఓ యోగా టీచర్ యూపీఐ ఐడీలను తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోనుంచి లక్షలు లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మూసాపేట్‌కు చెందిన యోగా టీచర్(38) జూబ్లీహిల్స్‌లోని పంచ యోగా కేంద్రంలో తాత్కాలిక ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తుంది. ఆ కేంద్రం హెల్ప్ డెస్క్ నుంచి ఫోన్ చేసి 14మంది బీఎస్ఎఫ్(బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది, అధికారులకు కొన్ని రోజుల పాటు యోగా శిక్షణ ఇవ్వాలని కోరారు. దీంతో ఆమె సరేననడంతో మరుసటి రోజు వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాడు బీఎస్ఎఫ్ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. వీడియో కాల్ రికార్డు ద్వారా యోగా శిక్షణకు అడ్వాన్స్ చెల్లిస్తామని తెలిపారు. బీఎస్ఎఫ్ నిబంధనతో పాటు స్పెషల్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు జరుగుతుందని, ప్రతీది రికార్డ్ చేస్తామన్నాడు. యోగా టీచర్ సరే అనడంతో ముందుగా మీ జీ-పే ఖాతాకు రూ.100 వేస్తామని చెప్పి వేశాడు. ఆ తర్వాత మీ జీపేలో క్రెడిట్ పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లి దాని లిమిట్‌ను లక్షకు పెంచుతామని చెప్పాడు. ఆ తర్వాత మీకు డబ్బు పంపిస్తుంటే రావడం లేదని చెప్పి ఆమె ఖాతానుంచి బది లీ చేసుకున్నాడు. వెంటనే ఆ డబ్బులు వాపస్ ఇవ్వాలని యోగా టీచర్ అడుగగానే వీడియో కాల్ కట్ అయ్యింది. మొత్తం రూ. 8.85 లక్షలు లూటీ అయ్యాయి. దీంతో చేసేదిలేక సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఓటీపీ అడిగి దోచేశాడు
కరెంటు బిల్లు వెంటనే చెల్లించండి.. లేకుంటే మీ కనెక్షన్ కట్ చేస్తాం.. ఆన్లైన్లో చెల్లించాలంటూ ఓటీపీ అడిగిన ఓ సైబర్ నేరగాడు విద్యుత్ వినియోగదారుడిని దోచుకున్నాడు. పంజాగుట్ట అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… బేగంపేటలోని మెథడిస్ట్ కాలనీలో నివాసముండే డాక్టర్ పి.సాంబశివరావు ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. సోమవారం ఓ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి జూన్ 2022 కరెంటు బిల్లు కట్టలేదని, వెంటనే కట్టకుంటే కనెక్షన్‌ను తొలగిస్తామని చెప్పాడు. బాధితుడి ఫోన్ నంబరుకు ఓటీపీ పంపించి దాని వివరాలను చెప్పమన్నాడు. ఓటీపీ చెప్పిన వెంటనే బ్యాంకు ఖాతానుంచి రూ.24,800, రూ. 24,925, యూనియన్ బ్యాంకు నుంచి రూ.74,350 డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.