సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): కూకట్పల్లి చోరీ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ఏ విఫలమైతే.. ప్లాన్ బీతో నేపాల్ నిందితులు దోపిడీకి స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. బాధిత కుటుంబం పెండ్లికి వెళ్లకపోయి ఉంటే.. నిద్రమాత్రలు ఇచ్చి.. దొంగతనం చేయాలని డిసైడ్ అయినట్లు తేలింది. నాలుగు నెలల కిందట నేపాల్‌కు చెందిన చక్రధార్జి సీతాధార్జి దంపతులు కూకట్‌పల్లిలోని వ్యాపారి దామోదర్ ఇంట్లో పనికి చేరారు. నమ్మకంగా పనిచేస్తూనే..ఇంట్లోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాగైనా ఇల్లు దోచేయాలని నిర్ణయించారు.
ఇంట్లో వృద్ధ దంపతులతో పాటు యువతి విద్య, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో బిజిబిజిగా ఉండటాన్ని గమనించారు. ఈ క్రమంలో ఇంటి పరిసరాలు, ఇతర విషయాలకు సంబంధించిన ఫొటోలను నేపాల్‌లో ఉండే ఉపేందర్‌కు అనేకసార్లు పంపినట్లు సమాచారం. ఓ సందర్భంలో ఊరికి వెళ్లివస్తామని చెప్పిన నేపాల్ దంపతులు.. అంతకు ముందు బెంగళూరులో పని చేసిన అనుభవం ఉండడంతో అక్కడ తిరిగారు.
అక్కడే ఉపేందర్‌ను సంప్రదించి ఇక్కడికి రప్పించారు. ఆ తర్వాత నిద్రమాత్రలను కొనుగోలు చేసి.. వాటిని పౌడర్‌గా మార్చి పెట్టుకున్నారు. ఎలాగైనా.. యువతి ఇంట్లో లేనప్పుడు వృద్ధులకు నిద్రమాత్రల పౌడర్‌ను కలిపి భోజనం పెట్టి.. మొత్తం లూటీ చేద్దామనుకున్నారు. ఒక వేళ ఆ యువతి ఉన్నా..ఆమెకు కూడా నిద్రమాత్రల పౌడర్ ద్వారా మూర్చపోయేలా చేసి.. మొత్తం ఊడ్చేద్దామనుకున్నారు. ఈ ప్లాన్‌తోనే తిరిగి ముగ్గురు కలిసి వచ్చి.. యధావిధిగా పనిచేసుకోవడం మొదలుపెట్టారు.
ఇంతలోనే వారికి కలిసి వచ్చే విధంగా ఆ ఇంట్లో వారు పెండ్లికి వెళ్తున్న విషయం తెలుసుకున్నారు. దీంతో నిద్రమాత్రల ప్లాన్‌ను రద్దు చేసుకొని.. ఎవరూ లేని సమయంలో చోరీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా నాలుగు రోజుల కిందట ఈ ముగ్గురు దొంగతనం చేసి పారిపోయారు. సైబరాబాద్ పోలీసులు నిందితులను శనివారం అరెస్టు చేసి కోటి రూపాయలు విలువ చేసే నగదు, బంగారం, డైమండ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరులోనే నెల రోజుల పాటు..
చోరీ చేసిన ఆ ముగ్గురు తర్వాత నేరుగా బెంగళూరుకు వెళ్దామని నిర్ణయించారు. గతంలో అక్కడ రెండేండ్లు పని చేసిన అనుభవం ఉండడంతో నెల రోజుల పాటు ఉండి ముందుగా సొత్తును దేశ సరిహద్దును దాటిద్దామని పథకం వేసుకున్నారు. అనంతరం వీరు నేపాల్ వెళ్లిపోదామని నిర్ణయించారు. రెండు రోజుల్లో సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి వెంటాడడంతో వారి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఎవరినైనా పనిలో పెట్టుకునే ముందు..