బంజారాహిల్స్,జూలై 17: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కత్తితో దాడికిపాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హకీంపేటలో నివాసం ఉంటున్న సద్దాం(32), ఫైజల్ యాబా(31) లు స్నేహితులు. ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తుంటారు. శనివారం వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. సెంట్రింగ్ పనులు చేయగా వచ్చిన డబ్బుల పంపకంలో ఇద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహానికి లోనైన యాబా తనతో తెచ్చుకున్న కత్తితో సద్దాం కడుపులో పొడిచాడు. దీంతో గాయాలపాలైన సద్దాంను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో యాబాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
భార్యను కాపురానికి పంపించడం లేదని..
గొడవపడి పుట్టింటికి వచ్చిన భార్యను తనతో పాటు పంపించడం లేదన్న కక్షతో బావమరిదిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. ముంబైలో నివసించే రజాక్(32) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య నజీమాబేగం భర్తతో గొడవపడి నాలుగురోజుల క్రితం ముంబై నుంచి బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 10లోని జహీరానగర్‌లో ఉన్న పుట్టింటికి వచ్చింది. కాగా శనివారం రాత్రి భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజాక్‌తో బావమరిది సమీర్ ఇనామ్దార్ గొడవకు దిగాడు. అక్కను పంపించేది లేదని చెప్పడంతో ఆగ్రహానికి గురైన రజాక్ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో సమీర్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ మేరకు బాధితుడిని ఆస్పత్రిలో చేరిపించిన కుటుంబ సభ్యులు నిందితుడిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భార్యపై దాడికి పాల్పడ్డ భర్తపై కేసు
పెళ్లయిన ఆరునెలల్లోనే భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన భార్యపై భర్త దాడి చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన అతీఫ్ అన్సారీ(25)కి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నస్రా సిద్ద్దిఖీ(21)తో ఆరునెలల క్రితం పెళ్లయింది. నాటినుంచే భర్త తీవ్రంగా వేధిస్తుండడంతో ఈ విషయాన్ని తన తండ్రి మొయినుద్దీన్‌కు చెప్పింది. దాంతో అల్లుడు అతీఫ్ అన్సారీతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని భావించిన మొయినుద్దీన్ సిద్దిఖీ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అల్లుడి ఇంటికి వచ్చారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో అడ్డుకునేందుకు వచ్చిన భార్య నస్రా సిద్దిఖీపై కుటుంబ సభ్యుల సమక్షంలో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. గదిలోకి లాక్కెళ్లి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.