మెహిదీపట్నం, జూలై 17: గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం బోనాల జాతరలో ఆరో బోనం పూజకు భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఓ వైపు సికింద్రాబాద్ బోనాలు, మరో వైపు వర్షం అయినా గోల్కొండకు భక్తుల తాకిడి తగ్గలేదు.ఆదివారం ఆరో బోనం పూజకు నగరం నలువైపుల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలి రావడంతో దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిసి పోయాయి. భక్తులు వర్షంలో తడుస్తూనే అమ్మవారికి బోనాలను సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాందాస్ బందీ ఖానా నుంచి ఆలయం వరకు ఉన్న క్యూలైన్లు గంటల తరబడి భక్తులతో నిండిపోయాయి.
కోటలో ఉన్న నాగదేవత పుట్ట దగ్గర నుంచి బోనాలను తెచ్చే వారితో పాటు పోతురాజుల నృత్యాలు,శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో మెట్ల మార్గం పులకరించింది. ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, ఈవో శ్రీనివాస్ రాజు, మైత్రి, పీస్ కమిటీ అధ్యక్షుడు సిరుగుమల్లె రాజువస్తాద్ వలంటీర్లను, పోలీసులను సమన్వయం చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డెవిస్ నేతృత్వంలో ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, గోల్కొండ ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి పకడ్బందీగా బందోబస్తును నిర్వహించారు.